తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదనీ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్, గాయకుడు ఎస్.పి.బాలులను ఘనంగా సత్కరించారు. ఇందులో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ 'తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే "శంకరాభరణం"కి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. తెలుగు పరిశ్రమకు మైలురాయిలాంటి సినిమా అది అన్నారు. విశ్వనాథ్‌తో సినిమాలు చేశాను. నాకు క్లాసు, మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది ఆయన సినిమాలే అని ఆయన ప్రకటించారు.
ఇకపోతే "విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో, బాలు గానంలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. వాళ్లని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం" అని అన్నారు. అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ 'అవార్డు వచ్చిందని నేనీ సన్మానానికి రాలేదు. సాధారణమైన వ్యక్తిగా వచ్చా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాకు ఇప్పుడు వచ్చింది. రేపు ఇంకొకరికి వస్తుంది. ఎప్పటికీ నేను కాశీనాథుని విశ్వనాథ్‌నే' అని వినమ్రయంగా చెప్పారు.
ఆ తర్వాత గానగంధర్వుడు ఎస్.పి.బాలు మాట్లాడుతూ... 'తెలుగు సినిమాతో 51 ఏళ్ల అనుబంధం నాది. ఇంతకాలం నన్ను భరించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నయ్య విశ్వనాథ్‌గారి పక్కన కూర్కొని సన్మానం అందుకోవడం గర్వంగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హీరోలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.