యంగ్రీ యంగ్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. డాక్టర్ రాజశేఖర్.. 'గరుడవేగ' (వేగం)తో దూసుకొచ్చి సక్సెస్ అందుకున్నారు. చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అవుతుంటారు.. కానీ ఈయన మాత్రం అటు డాక్టర్‌గా.. ఇప్పటికీ నిత్య విద్యార్థిలా మెడిసిన్‌లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇటు నటుడిగానూ నేను చేయాల్సింది చాలా ఉందంటున్నారు. ఈయన తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు.
గరుడవేగ చిత్రం సక్సెస్ అవుతుందని అనుకున్నా. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 'అంకుశం' కంటే రెట్టింపు సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని తమిళం, హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాం. తమిళంలో అయితే వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. హిందీ రిలీజ్ చేయాలంటే టైమ్ పట్టొచ్చు.
అలాగే, నాకు యాంటీ హీరోగా చేయాలని ఉంది. 'ఆహుతి', 'తలంబ్రాలు'లాంటి స్టోరీ చేయాలని కోరిక ఉంది. అంతేకాదు.. విలన్‌గా చేయడానికైనా నేను రెడీ! అంతేకాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా చేస్తా. కాకపోతే రొటీన్‌గాకాకుండా చాలెంజింగ్‌గా నా పాత్ర ఉండాలి. ఉదాహరణకి "ధృవ" సినిమాలో అరవింద్ స్వామిలాంటి పాత్ర అన్నమాట. చాలామంది నేను చేస్తానో, లేదో అని తడబడుతున్నారని టాక్ విన్నాను. అలాంటిదేమీ లేదు. నేను ఎలాంటి పాత్రనైనా చేస్తాను. హీరోగా చేసి, హీరోల చేతిలో తన్నులు తినేందుకు సిద్ధంగా ఉన్నట్టు డాక్టర్ రాజశేఖర్ చెప్పారు.