ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

ఠాగూర్

మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (13:58 IST)
తనకు ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ కోరారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయన గత జూలై 21వ తేదీన అనారోగ్యం కారణంతో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేగా తన పింఛను పునరుద్ధరణకు తాజాగా దరఖాస్తు చేశారు. 
 
1993 - 1998 మధ్య కిషన్‌‌గఢ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ధన్కర్ 2019 జులై వరకు ఈ పింఛను తీసుకున్నారు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ గవర్నరుగా నియమితులవడంతో పింఛను నిలిచిపోయింది. అనారోగ్య సమస్యల కారణం చూపి ఉప రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగిన ధన్కర్ పాత పింఛను పునరుద్ధరించాలని రాజస్థాన్ అసెంబ్లీ సచివాలయానికి విజ్ఞప్తి చేశారు. 
 
ఆయన దరఖాస్తు తమకు అందిందని, ఆ ప్రక్రియను ప్రారంభించినట్లు రాజస్థాన్ అసెంబ్లీ స్పీకరు వాసుదేవ్ దేవనానీ వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేగా 74 ఏళ్ల ధన్కర్‌కు రూ.42 వేల వరకు పింఛను లభించనుంది. అలాగే మాజీ ఎంపీగా మరో రూ.45 వేలు, మాజీ ఉప రాష్ట్రపతిగా దాదాపు రూ.2 లక్షలు, టైప్ - 8 బంగళా, దాదాపు 10 మంది వ్యక్తిగత సహాయక సిబ్బంది వంటి ఇతర సదుపాయాలు సైతం ఆయనకు అందుబాటులో ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు