వెండితెరపై బాలనటిగా మెప్పించి హీరోయిన్‌గా అలరించిన నటీమణులలో ఒకరు హన్సిక. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చి, అనతి కాలంలోనే తమిళుల ఆరాధ్యదేవతగా మారిపోయింది. ఒకప్పుడు ఏడాదికి 10 -12 సినిమాలతో బిజీ బిజీగా ఉండే హన్సిక ఇప్పుడు నాలుగైదు సినిమాలకే పరిమితమైంది. ఒక్కసారిగా సినిమాలు ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందో హన్సిక వివరించింది.
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, సినిమాలు తక్కువ చేస్తున్నాను అంటే అవకాశాలు లేక కాదు. నాకు నేనుగా తగ్గించుకున్నాను. గత సంవత్సరం 18 కథలు విన్నాను. కేవలం నాలుగు సినిమాలకే ఓకే చెప్పాను. ఇప్పటికే దాదాపు 50 సినిమాలు చేశాను. నా వయస్సు హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఎక్కువ సినిమాలు చేసినట్టే లెక్క. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో గ్లామర్ హీరోయిన్‌గా చేశాను. ఇకపై అలాంటి పాత్రలకు దూరంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది.
నిజానికి నేను అప్పుడే 50 సినిమాలు చేశానంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్ని సినిమాలు చేసానన్న లెక్క ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇటీవల ఎవరో నాతో 'అప్పుడే 50 సినిమాలు చేసేసావే' అనడంతో లెక్క చూసుకున్నాను. నేను చేసిన సినిమాల్లో కొన్ని నాకు అస్సలు గుర్తే లేవు. దాంతో వికిపీడియాలో వెతకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.