సాధనలు తప్పక చేసి తీరాలి. భగవద్దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి...? భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు... అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అప్పుడు నా మనస్సులో స్పురించింది అతనికి చెప్పాను. పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు. గాలం, ఎర అన్నీ సిద్దం చేసుకో. ఎర వాసన పట్టి చేప నీటి అడుగు నుండి పైకి వస్తుంది. నీళ్లు కదలడం నుండి పెద్ద చేప వస్తుంది అని తెలుసుకోవచ్చు.
వెన్న తినగోరుతున్నావు... పాలల్లో వెన్న ఉంది, పాలల్లో వెన్న ఉంది.... అని పదేపదే అనడంలో ప్రయోజనం ఏముంది. శ్రమ పడితేనే కదా వెన్న లబించేది. భగవంతుడు ఉన్నాడు.... భగవంతుడు ఉన్నాడు.... అని చెప్పడం వల్ల భగవంతుని దర్శించగలవా.... కావలసింది సాధనే.... లోకోపదేశార్దం జగజ్జననియే పంచముండి ఆసనం అదిష్టించి కఠోరమైన తపస్సు చేసింది.