మాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న జస్టిస్ హేమ కమిషన్ నివేదిక - విచారణకు సిట్!!

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (11:03 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మహిళా నటులపై కమిట్‌మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ నిర్ణయించింది. 
 
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీలు, దుర్వినియోగం మరియు ఇతర మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలను వెల్లడించిన జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక ఆధారంగా సమగ్ర పోలీసు దర్యాప్తు ప్రారంభించాలని పలు సంఘాలు,  రాజకీయ పార్టీలు  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను డిమాండ్ చేసిన అనంతరం‌ ఈ ప్రకటన వెలువడింది. సిట్‌కి ఐజీ ర్యాంక్ అధికారిణి స్పర్జన్ కుమార్ నేతృత్వం వహిస్తారు. ఇతర సీనియర్ మహిళా అధికారులు సిట్‌లో ఉండనున్నారు.
 
ఇక‌ మలయాళ చిత్ర నిర్మాత రంజిత్‌పై బెంగాల్ నటి శ్రీలేఖ మిత్ర సంచలన ఆరోపణలు చేశారు. 2009లో రంజిత్ దర్శకత్వం వహించిన ‘‘పలేరి మాణిక్యం: ఒరు పతిర కోలపతకతింటే కథ’’ సినిమా ఆడిషన్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించింది. తనకు సినిమా అవకాశం ఇస్తానని, సినిమా గురించి చర్చించేందు హోటల్ గదికి రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలోకి వెళ్లిన తర్వాత తనతో అసభ్యం ప్రవర్తించడంతో షాక్ గురై అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశాడు.
 
మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. త‌న‌ను రేప్ చేశాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ సిద్ధిఖీపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌లు మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసి త‌న రాజీనామా లేఖ‌ను ప్రెసిడెంట్ మోహ‌న్ లాల్‌కు అందజేశాడు. తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్నానని, ఈ పరిస్థితిలో పదవిలో కొనసాగడం సరికాదని ఆయన ధృవీకరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని సిద్ధిఖీ తెలిపారు. 
 
2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళల వేధింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 
 
2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం సహజంగా మారిందని నివేదిక వెల్లడించింది. సినీ పరిశ్రమను క్రిమినల్ గ్యాంగ్స్ నియంత్రిస్తున్నాయని ఆరోపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు