17న 'మా అబ్బాయి'గా వస్తున్న హీరో శ్రీవిష్ణు

మంగళవారం, 7 మార్చి 2017 (15:46 IST)
'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌', 'ప్ర‌తినిధి', 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ... "అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు ఇమేజ్‌ని మరింత పెంచే సినిమా అవుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. మా వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాతో ఇండస్ట్రీలో నిలబడిపోతుందనే గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు కుమార్ వట్టి కొత్తవాడైనా , అనుభవజ్ఞుడిలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు". అని చెప్పారు.
 
దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ... "ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్‌ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది" అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి