నేడు దర్శకుడు వశిష్ట పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. వశిష్ట అసలు పేరు మల్లిడి వేణు. బన్నీ, భగీరథ, ఢీ వంటి చిత్రాలు నిర్మించిన సత్యనారాయణ రెడ్డి కుమారుడైన వశిష్టకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే హీరోగా 'ప్రేమలేఖ రాశా' అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆయనకు మంచి అనుభూతులు మిగిల్చింది. అయినా సరే నటుడిగా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఆయన తర్వాత దర్శకత్వం వైపు ఆసక్తి కనబరిచారు. నిజానికి మొదటి సినిమా చేసిన తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడంతో సినీ పరిశ్రమకు దూరం అయిపోయారేమో అనుకున్నారు అంతా.
కానీ సినీ పరిశ్రమ మీద విపరీతమైన మక్కువ పెంచుకున్న వశిష్ట అందుకు భిన్నంగా దర్శకుడిగా కొంతకాలం రీసర్చ్ చేసి 'బింబిసార' అనే కథ సిద్ధం చేసుకున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఆ కథ చెప్పి ఒప్పించడమే కాదు, తనదైన శైలిలో డైరెక్ట్ చేసి చాలాకాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఒక్కసారిగా ఆ సినిమాతో సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. అయితే ఆ తర్వాత వశిష్ట ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మెగా న్యూస్ చెప్పేశాడు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోని అప్రోచ్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా రెండో సినిమాని మెగాస్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వశిష్ట.