ఇస్తాంబుల్ ఆత్మాహుతి దాడి నుంచి హృతిక్ రోషన్ ఎలా తప్పించుకున్నారో తెలుసా?

గురువారం, 30 జూన్ 2016 (08:57 IST)
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి నుంచి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెల్సిందే. ఇలా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి కారణం ఆయన ప్రయాణించిన ఎకానమీ క్లాసే కారణం కావడం గమనార్హం. 
 
టర్కీలోని ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 240 మంది గాయపడిన విషయం తెల్సిందే. మృతుల్లో 13 మంది విదేశీయులు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.
 
అయితే, ఈ దాడి నుంచి హృతిక్ రోషన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనికి కారణం ఆయన ఎకానమీ క్లాసులో ప్రయాణించాలన్న నిర్ణయమే ప్రాణాలు కాపాడింది. ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడి నుంచి బాలీవుడ్‌ స్టార్‌, ఆయన ఇద్దరు పిల్లలు త్రుటిలో తప్పించుకొన్నారు. హృతిక్‌ తన ఇద్దరు పిల్లలు హ్రిహాన్‌, హ్రిదాన్‌తో కలిసి స్పెయిన్‌, ఆఫ్రికా టూర్‌కి వెళ్లారు. 
 
ఈ పర్యటన ముగించుకుని భారతదేశానికి తిరుగు ప్రయాణమైన వీరు, మంగళవారం ఇస్తాంబుల్‌లో భారత్‌కు వచ్చే కనెక్టింగ్‌ ఫ్లైట్‌ను ఎక్కాల్సి ఉంది. అది మిస్‌ కావడంతో కొద్దిసేపు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాసులో భారత్‌కు చేరుకొనేందుకు మరో విమానం బుధవారం వరకు లేకపోవడంతో హృతిక్‌ ఎకానమీ క్లాసులో ప్రయాణించాలని నిర్ణయించుకొని మంగళవారం రాత్రి ఇస్తాంబుల్‌ నుంచి భారత్ బయలుదేరారు. ఆయన ఇస్తాంబుల్‌ విమానాశ్రయాన్ని వీడిని కొద్దిసేపటికే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి