పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన "అబీర్ గులాల్" చిత్రంపై కేంద్రం నిషేధం విధించింది. కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు ఈ నెల 22వ తేదీన దాడికి తెగబడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. ఇందులోభాగంగా, వచ్చే నెల 9వ తేదీన అబీర్ గులాల్ విడుదలకానుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చిత్రంపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో కేంద్రం కన్నెర్రజేసింది. ఈ సినిమా భారత్‌లో విడుదలకాకుండా నిషేధం విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మరోవైపు, యూట్యూబ్ (ఇండియా)లో ఈ సినిమా పాటలను కూడా తొలగించారు. ఈ విషయంపై చిత్ర దర్శక నిర్మాతలు స్పందించలేదు. ఉగ్రదాడిపై స్పందించకుండా అదే రోజు సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటి వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించింది. అలాగే, పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఆర్తి ఎస్ బగ్దీ ఈ చిత్రాన్ని నిర్మించారు.