ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ''ట్రైలర్ నుంచి బేసిక్ పాయింట్ అర్థం అయ్యి ఉంటుంది. నేను విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు తీశా. నాకు తెలంగాణపై అవగాహన లేదు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గురించి విన్నాను. అప్పుడు కొండా మురళి పేరు ప్రత్యేకంగా అనిపించింది. నేను రియలిస్టిక్, రస్టిక్ సినిమాలు తీశా. మురళి, సురేఖ క్యారెక్టర్లు నాకు స్పెషల్‌గా అనిపించాయి. అంతకు ముందు అటువంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదు. వాళ్ళ గురించి తెలిశాక... సినిమా తీయాలని రీసెర్చ్ చేశా. కొండా ఫ్యామిలీని కలిశా. సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. నా తల్లిదండ్రుల కథ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తానని కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ చెప్పారు. నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళ కథ అంటే వాళ్ళ ప్రాపర్టీ కదా! వెంటనే ఓకే చెప్పా'' అని అన్నారు.
కొండా సుష్మితా పటేల్ మాట్లాడుతూ ''ట్రైలర్ చూశారు కదా! రాము గారు చాలా రియలిస్టిక్ గా తీశారు. 1980ల నుంచి జరిగే కథ. సినిమా తీస్తానని రాము గారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. మా తల్లిదండ్రుల కథ అందరికీ తెలియాలని అనుకున్నాను. అమ్మానాన్న ఇద్దరూ స్టూడెంట్ లీడర్లుగా స్టార్ట్ అయ్యారు. తర్వాత రాడికల్ నేపథ్యం వైపు ఆకర్షితులు అయ్యారు. రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎదగాలని నాన్న చాలా తాపత్రయపడ్డారు. కొండా మురళి, కొండా సురేఖ ప్రస్థానం అంత ఈజీ కాదు. చాలా ఒడిదుడుకులతో, పెత్తందార్ల చేతుల్లో నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయారు. బంతి ఎంత కిందకు కొడితే, అంత పైకి వస్తుందన్న రీతిలో.... సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నేతగా ఎదిగారు. ఇవన్నీ జనాలకు తెలియాలి. ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తానని రిక్వెస్ట్ చేశా. ఆయన ఓకే అన్నారు. త్రిగుణ్ ఫెంటాస్టిక్ గా చేశారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. నిర్మాణ పరంగా మా టీమ్, రాము గారి టీమ్ ఫ్యామిలీలా కలిసిపోయి చేశారు. ఒక్క రోజు కూడా షూటింగ్ ఆగలేదు. నా చిన్నతనం నుంచి రాము గారు నా ఫెవరేట్ డైరెక్టర్. ఆయనతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆయనకు థాంక్యూ'' అని చెప్పారు.
త్రిగుణ్ మాట్లాడుతూ ''కొండా మురళిగారి పాత్రలో... నేను ఇలా కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 'కొండా' స్క్రిప్ట్ చెప్పినప్పుడు 'మీరెందుకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీస్తారు?' అని రాము గారిని అడిగా. 'ఎవరు రికార్డు చేయని హిస్టరీని చెప్పాలని అనుకుంటాను. అది నా బాధ్యతగా భావిస్తా' అని ఆయన చెప్పారు. సినిమా అనేది వినోదమే అయినప్పటికీ... వినోదంతో పాటు సమాజంలో ఏం జరుగుతుందనే కొన్ని విషయాలు చెప్పాలని చెప్పారు. నేను ఇటువంటి యాక్షన్ రోల్ చేస్తానని ఊహించలేదు. అయితే, రొమాంటిక్ సినిమాలు కాకుండా యాక్షన్ ఫిలిమ్స్ చేయాలని నా ఫస్ట్ హీరోయిన్ జెనీలియా చెప్పింది. ఆమె విజన్ ఈ రోజు నిజం అయ్యింది. నా పేరు, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్... రాము గారు చాలా మార్పించారు. నేను హైదరాబాదులో పెరిగా. వరంగల్ రాజకీయాలు, అక్కడి పరిస్థితుల గురించి తెలియదు. రాము గారు కథ చెప్పినప్పుడు అక్కడికి వెళ్లి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. రాము గారు ఆయన హోమ్ గ్రౌండ్ క్రైమ్ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. కొండా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే... అందరూ బావుండాలని కోరుకుంటారు. అందరూ ఒక్కటేనని భావిస్తారు. ఆ ఆలోచన కోసమైనా వాళ్ళు బావుంటారు. జూన్ 23న సినిమా వస్తుంది. థియేటర్లలో చూడండి. నేను సినిమాలు చేస్తూ ఉంటా. ఐదు రోజుల్లో పుట్టినరోజు ఉంది. కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తా'' అని అన్నారు.
పృథ్వీరాజ్, పార్వతి అరుణ్, ప్రశాంత్, ఎల్బీ శ్రీరామ్, తులసి, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, అభిలాష్ చౌదరి, శ్రవణ్, అనిల్ కుమార్ రెడ్డి లింగంపల్లి, గిరిధర్ చంద్రమౌళి, రవి, షబీనా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళా దర్శకత్వం: అంజి, ఆటో జానీ, కూర్పు: మనీష్ ఠాకూర్, పోరాటాలు: శ్రీకాంత్, మాటలు: భరత్, ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి, సమర్పణ: శ్రేష్ఠ పటేల్ మూవీస్, నిర్మాణం: ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్, నిర్మాత: శ్రీమతి సుష్మితా పటేల్, కథ - కథనం - దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.