ఇళయరాజా కుమార్తె భవతారిణి మృతి

వరుణ్

గురువారం, 25 జనవరి 2024 (21:22 IST)
'ఇసైజ్ఞాని ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు, సినీ నేపథ్యగాయని భవతారిణి కాలేయ కేన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆమెకు వయస్సు 47. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమెకు... ఆయుర్వేద చికిత్స కోసం సోదరుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా శ్రీలంకకు తీసుకెళ్ళారు. అక్కడి వైద్యులు కేన్సర్ నాలుగో దశగా గుర్తించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె గురువారం సాయంత్రం 5.20 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
తన తండ్రి ఇళయరాజా సంగీతం అందించిన 'భారతి' అనే చిత్రం కోసం ఆమె పాడిన పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా 2000 సంవత్సరంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సినిమా పాటలను ఆలపించారు. అంతేకాకుండా, ఆమె సంగీత దర్శకురాలిగా కూడా కొనసాగుతున్నారు. 
 
చెన్నై నగరంలోని రోసరీ మెట్రిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె... నటి రేవతి దర్శకత్వం వహించిన 'మిత్ర మై ఫ్రెండ్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా, 'రాసయ్య' అనే చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. తన తండ్రి ఇళయరాజా, సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం సమకూర్చిన సినిమాలకే నేపథ్యగానం చేశారు. ఆమె దాదాపు 20కి పైగా చిత్రాలకు పాటలు పాడారు. 
 
అలాగే, 2002లో సంగీత దర్శకురాలిగా పరిచయమైన ఆమె.... దాదాపు 10 చిత్రాలకు సంగీతం అందించారు. వీటిలో రెండు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. 2019లో ఆమె చివరగా 'మాయండి' అనే చిత్రానికి సంగీతం అందించగా, ఇపుడు మూడు చిత్రాలకు సంగీతం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
కాగా, ఇళయరాజా కూడా శ్రీలంకలోనే ఉన్నారు. శనివారం శ్రీలంకలో ఇళయరాజా మ్యూజిక్ ఫెస్ట్ కార్యక్రమం జరగాల్సి ఉండగా, ఇందుకోసం ఆయన అక్కడకు వెళ్ళారు. భవతారిణి మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకునిరానున్నారు. భవతారిణి భర్త శబరి రాజ్ వ్యాపారం చేస్తుండగా, ఈ దంపతులకు సంతానం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు