చల్లని జాబిల్లి కాదు.. మండే చంద్రుడు... ఉష్ణోగ్రత ఎంతంటే...

సోమవారం, 28 ఆగస్టు 2023 (15:30 IST)
చంద్రుడి ఉపరితలంపై ఏమాత్రం చల్లదనంగా లేదని, అక్కడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధృవం అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 తన పనిని ప్రారంభించింది. ఇందులో అమర్చిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు అద్భుతమై సమాచారాన్ని, ఫోటోలను సేకరించి భూమికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలి శాస్త్రీయ పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం వెల్లడించింది. 
 
విక్రమ్ ల్యాండర్‌లోని 'చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్' పేలోడ్.. చందమామ ఉపరితలంపై కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్ రూపంలో విడుదల చేసింది. 'చాస్టే పేలోడ్.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నేల పైపొర ఉష్ణోగ్రతలను లెక్కిస్తుంది. తద్వారా జాబిల్లి ఉపరితల థర్మల్ ధర్మాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. నేలపై 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్‌కు ఉంది. దీనికి 10 సెన్సర్లు అమర్చి ఉన్నాయి' అని ఇస్రో పేర్కొంది. 
 
చంద్రుడి ఉపరితలంపైన, కాస్త లోతులో నమోదైన ఉష్ణోగ్రత వైవిధ్యాలు సంబంధిత గ్రాఫ్‌లో కనిపిస్తున్నట్లు చెప్పింది. గ్రాఫ్ ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉంది. అదే 80 మిల్లీమీటర్ల లోతులో దాదాపు -10 డిగ్రీలుగా చూపిస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇది మొదటి వివరాలు అని, పూర్తిస్థాయి పరిశీలనలు జరుగుతున్నాయని ఇస్రో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ల్యాండర్ మాడ్యుల్లోని రాంభా, చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పరిమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ పేలోడ్లను గురువారమే ప్రారంభించిన విషయం తెలిసిందే. 'చంద్రయాన్-3' మిషన్ ఇప్పటికే తన రెండు లక్ష్యాలను పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు