పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

ఠాగూర్

ఆదివారం, 10 ఆగస్టు 2025 (11:48 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలకు తానున్నానంటూ భరోసా కల్పించే కార్యక్రమాలను వ్యక్తిగతంగానూ నిర్వహిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఈ కార్యక్రమాల కోసం ఆయన సొంత నిధులను ఖర్చు చేస్తున్నారు.
 
ఎమ్మెల్యేగా తనకు ప్రతి నెలా వచ్చే వేతనం నుండి నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున అందిస్తూ నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇటీవలే పవన్ ఆదేశాలతో పిఠాపురంలోని అనాథ పిల్లలకు పార్టీ నేతలు రూ.5 వేల వంతున అందజేశారు. తాజాగా రాఖీ పండుగను పురస్కరించుకుని మరో అనూహ్య కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు.
 
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 1500 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా చీరలను కానుకగా పంపించారు. ఆ చీరలను మహిళలకు తన కానుకగా అందించాలని పిఠాపురం జనసైనికులను పవన్ కల్యాణ్ కోరారు. వితంతువులందరికీ సోదరుడిగా తానున్నానని భరోసా కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పవన్ ఆదేశించారు.
 
అధినేత ఆదేశాలతో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి రక్షాబంధన్ కానుకగా పంపిన చీరలను పార్టీ నేతలు, క్రియాశీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి అందజేశారు. పవన్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఆయన ఈ కానుకలను పంపినట్లు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఊహించని రక్షాబంధన్ కానుకతో మహిళలు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు