గత వైకాపా ప్రభుత్వంలో ఆడుందా ఆంధ్రా పేరుతో క్రీడలశాఖామంత్రిగా ఉన్న ఆర్కే రోజా... భారీగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పూర్తి కావడంతో విజిలెన్స్ అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైకాపా హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన పలు క్రీడా కార్యక్రమాల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా, క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధుల దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్కామ్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ దర్యాప్తు ముగియడంతో విజిలెన్స్ అధికారులు ఒక నివేదికను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. దీన్ని రాష్ట్ర డీజీపీకి అందజేయనున్నారు. ఆ తర్వాత ఈ నివేదిక ఆధారంగా నిధులు దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే తొలుత అరెస్టు అయ్యేది మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత, సినీ నటి ఆర్కే రోజానే అని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.