దర్శక రచయితలు కాగితంపై రాసిచ్చినదాన్ని తెరపై ఒక నటిగా ఆవిష్కరించానని జాతీయ అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్ అన్నారు. ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రాంబలం చిత్రానికిగాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది. దీనిపై ఆమె తన స్పందనను గురువారం ఓ ఆడియో రూపంలో తెలియజేశారు. ఈ అవార్డు కేవలం తిరుచిట్రాంబలం చిత్రంలోని పాత్రకు మాత్రమే కాదనని, అనేక చిత్రాల్లోని తన నటనకు గుర్తింపుగా లభించిందన్నారు.
'ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం. దాన్ని స్వీకరించిన వెంటనే పలువురు జ్యూరీ సభ్యులను కలిశా. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడడం కొత్త అనుభూతి. ఈ అవార్డు ఈ ఒక్క సినిమా (తిరుచిట్రాంబలం)కే కాదు, ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలన్నింటికీ దక్కుతుంది. తిరులోని శోభన పాత్ర పోషించడం తేలిక కాదని ధనుష్ సినిమా ప్రారంభానికి ముందు చెప్పారు. ఆ రోల్ నాకు పూర్తి భిన్నమైంది. కానీ, దర్శక- రచయితలు కాగితంపై ఏం రాస్తారో.. దాన్ని తెరపై ఓ నటిగా ఆవిష్కరించా. మూస ధోరణికి భిన్నమైన ఆ పాత్రకు అవార్డుకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇంటెన్స్ యాక్టింగ్, మూవీస్‌కు అవార్డులు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. అది అవాస్తవం' అని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం తన చేతిలో పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటివరకూ నేను నటించని కొత్త జానర్‌లో అది రూపొందుతోంది. ఈ యేడాది చివరిలో గోల్డెన్ వీసా సినిమా ప్రారంభం కానుంది. కాదలిక్కా నేరమిల్లై (తమిళ్) షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల కానుంది అని ఆమె వివరించారు.