చిరంజీవిగారూ... మిమ్మలను చూస్తే నాకు అలా అనిపించలేదు.. జేడీ చక్రవర్తి

ఆదివారం, 3 మే 2020 (14:42 IST)
టాలీవుడ్ హీరోల్లో జేడీ చక్రవర్తి ఒకరు. అక్కినేని నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన "శివ" చిత్రంలో ఆయన విలన్‌గా నటించాడు. ఈ పాత్రతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన "బొంబాయి ప్రియుడు" చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం విలన్ పాత్రలతో పాటు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అలాంటి జేడీ చక్రవర్తి ఇపుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా, ఆయన చిరంజీవికి ఏకంగా ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ లేఖలో జేడీ చక్రవర్తి పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, 
 
'ప్రియమైన చిరంజీవిగారు.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని ఒక కంప్లీట్ యాక్ట‌ర్‌గా ఇష్ట‌ప‌డేవాడిని.. అంతే. నా త‌రం నటులంద‌రూ మీతో చ‌క్క‌గా క‌లిసిపోయేవారు. నేనెప్పుడూ అలా చేయ‌లేదు, చేయాల‌నుకోలేదు. 
 
ఇపుడు క‌రోనా ప్ర‌భావంతో ప్ర‌పంచ‌మంతా ఆగిపోయింది. సినిమా ప‌రిశ్ర‌మ ఎప్పుడూ లేనంత కూల‌బ‌డింది. ప్ర‌స్తుతం సినిమా ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను మీతో పాటు నేను కూడా ఫేస్ చేస్తున్నాను. 
 
ఇప్పుడు మీరు చేస్తున్న ప‌ని మిమ్మ‌ల్ని ఒక మెగాస్టార్ అని చెప్ప‌లేం.. గొప్ప వ్య‌క్తిగా అభివ‌ర్ణించాలి. సినీ రంగంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆక‌లి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. 
 
మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా భావిస్తున్నాను. ఎప్ప‌టికీ మీ అభిమానిని, అనుచ‌రుడిని' అంటూ తన లేఖలో జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
కాగా, కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, కూలీలు, వర్కర్లను ఆదుకునేందుకు చిరంజీవితో పాటు మరికొందరు కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీస్ మనకోసం అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా విరాళాలు సేకరించి పేద కళాకారులు, వర్కర్లు, కూలీలు ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు