టాలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో జగపతిబాబు. ఆదిలో హీరోలుగా నటించిన ఈయన.. ఇపుడు విలన్ పాత్రల్లో జీవిస్తున్నారు. ఈయన పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రతినాయకపాత్రల్లో రాణిస్తున్నారు. దీంతో అనేక మంది హీరోలు తమ చిత్రాల్లో జగ్గూభాయ్‌ను విలన్‌గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ తాజా చిత్రం అన్నాత్తేలో కూడా జగ్గూబాయ్ నటిస్తున్నారు. అయితే, ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియడం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో "లింగా" చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, సూపర్‌స్టార్ రజనీకాంత్ కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురికావడంతో అన్నాత్తే చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా.. ఆ సినిమా షూటింగ్ గురించి కొన్ని వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షూటింగ్ సందర్భంగా గత డిసెంబర్‌లో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేరిన ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయి.
ఈ క్రమంలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌కు కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా.. ఆయన చెన్నైలో జరుగుతున్న అన్నాత్తె షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఆయనతో పాటే వైద్యులు కూడా సినిమా సెట్లోనే అందుబాటులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ సినిమా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రకాశ్‌రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలావుండగా.. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించించింది. ఈ సినిమాను నవంబరు 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.