సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అమృత కర్ణాటక హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆమె పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, హీరో శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించారు. ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అంతేకాదు జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పడం గమనార్హం. అమృత పిటిషన్ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ యేడాది మార్చి 20న మృతి చెందారు. జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత అందులో పేర్కొన్నారు. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.