కోమలవల్లి అలియాస్ జయలలిత సినీ ప్రస్థానం సాగిందిలా...!
సోమవారం, 5 డిశెంబరు 2016 (20:46 IST)
కోమలవల్లి అలియాస్ జయలలిత. ఇది సినీ అభిమానులకు ఇష్టమైన పిలుపు. కానీ, ప్రస్తుతం తమిళ ప్రజలు మాత్రం ముద్దుగా పిలుచుకునే పేరు అమ్మ. ఇపుడు తమ ఇష్టదైవం అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి భయకరమైన వార్త వినాల్సి వస్తుందో అని బరువెక్కిన హృదయాలతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయివున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఒకప్పటి అందాల తార.. ఆమె సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే... చిన్నప్పటి నుండే కళల మీద ఆసక్తి కలిగిన జయలలిత క్లాసికల్ మ్యూజిక్‌తో పాటుగా భరత నాట్యం, మణిపురి, కథక్‌లాంటివి నేర్చుకున్నారు.
1961లో జయలలిత 'శ్రీశైల మహాత్మ్యం' అనే సినిమాలో బాల నటిగా కనిపించారు. చిన్న చిన్న వేషాలతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత నెమ్మదిగా నిలదొక్కుకున్నారు. తను సినిమాల్లో మొదట పారితోషికంగా 3000 రూపాయలు తీసుకున్నారు. 1964లో కన్నడ సినిమా 'చిన్నడ గాంబే'లో ప్రధాన పాత్రను పోషించారు.
తెలుగులో మాత్రం అక్కినేని హీరోగా నటించిన 'మనసులు మమతలు' అనే చిత్రంలో జయలలిత నటించి.. అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తమిళ నట దిగ్గజం ఎంజీఆర్‌తో 10 సినిమాల దాకా నటించగా, మహా నటుడు శివాజి గణేషన్‌తో నటించి ఆయనను తన నటనతో మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో చాలా సినిమాల్లో ఆమె నటించారు.
అలా సుమారు 50కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన జయలలిత తెలుగు ప్రేక్షక హృదయాల్లో కూడా నిలిచిపోయారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన జయలలిత రామచంద్రన్ మరణానంతరం 1989లో అసెంబ్లీకు ఎన్నికైన తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఇక అప్పటినుంచి రాజకీయాల్లో తిరుగులేని మహిళగా ఎదిగారు.
అలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అందాల నటిగా తనదైన ముద్ర వేసిన నటీమణి జయలలిత. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన జయలలిత అప్పట్లోనే చాలా మోడ్రన్‌గా కనిపించేది. ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉండగానే రాజకీయాల్లోకి వెళ్లారు.
మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జయలలిత ఫిబ్రవరి 24, 1948న జన్మించింది. ఆమె తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ. జయలలిత అసలు పేరు కోమలవల్లి. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు.
జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. చిన్ననాటి నుంచి ఎంతో చురుకుగా ఉండే జయలలిత తన స్నేహితురాళ్లతో కలిసి ఉండేది.