జయమ్మ పంచాయితీ సినిమా విడుదలకుముందు ప్రివ్యూనాడే సినీప్రముఖ/ల ప్రశంసలు దక్కించుకుంది. ఇక విడుదలైనరోజే భారీ ఓపెనింగ్‌తో మహిళల ఆదరణతో పాలకొండ, శ్రీకాకుళం, విజయనగరంపాటు అన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శించడం ఆనందంగా వుందని చిత్రయూనిట్ తెలియజేస్తోంది.
సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అయ్యారు. యువ జంటగా దినేష్ కుమార్, షాలినీ నటించారు. మే6న విడుదలైన ఈ సినిమా సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. ఈ సందర్భంగా శనివారంనాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియా సమావేశంలో పంచుకున్నారు.
సుమ మాట్లాడుతూ, దర్శకుడు చిన్న చిన్న అంశాలతోపాటు కులం, మతం, నగ్జలిజం వంటి అంశాలనూ చాలా చక్కగా టచ్ చేశాడు. డైలాగ్స్‌లు సందర్భానుసారంగా వుంటూ ఆలోచింపజేసేలా రాశారు. శ్రీకాకుళం యాసను నేర్చుకుని పాత్రలో ఒదిగిపోయేలా చేసిన దర్శకుల టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగీత దర్శకులు కీరవాణి మాకు సపోర్ట్‌గా నిలవడడం కొండంతబలాన్నిచ్చాయి. పాటలు ఎక్కడ వుండాలో అక్కడ వుండేలా బాణీలు సమకూర్చారు. నిర్మాత బలగప్రకాష్ వుండబబ్టే విజయ్‌కుమార్ తీయగలిగారు. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాను అందరూ చూసి ఆనందించండి. మంచి సినిమా చేశామన్న తృఫ్టినిచ్చింది అన్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు మాట్లాడుతూ, తెలుగు సినిమా పరిశ్రమ యావత్తూ, మహేష్‌బాబు, కీరవాణి, రాజమౌళి ఎంతో మంది మా సినిమాకు ప్రమోషన్ చేయడానికి కారణం ఉమెన్ సెంట్రిక్ కథ, సుమగారి నటన వల్లే సాధ్యమయింది. త్రివేండ్రంలో మిక్సింగ్ జరుగుతుండగా సినిమా చూశాక నా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. జీవితంలో ఈ ఒక్క సినిమా చాలు అనిపించింది. రిలీజ్‌కు ముందు మొన్న ఎ.ఎం.బి.థియేటర్‌లో ప్రముఖులతో ప్రివ్యూ వేశాం. ఆరోజు దర్శకులు సుకుమార్, నందినిరెడ్డి వంటివారెందరో చూసి మెచ్చుకోవడం విశేషం. సుకుమార్‌గారయితే దర్శకుడు ఎక్కడా! అంటూ వచ్చి అభినందించారు. నందినిరెడ్డిగారు గౌవరంగా నాకు నమస్కరించడం మర్చిపోలేనిది. చూసినవారంతా తెలుగులో బెస్ట్ ఫిలిం అంటూ కితాబిచ్చారు. సుకుమార్‌గారు అయితే `మీరు ఊ.. అనండి మీతో సినిమా చేస్తానంటూ` హామీ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికీ హార్ట్ టచ్ చేసే సినిమా అని తెలిపారు.
నటుడు దినేష్ కుమార్ మాట్లాడుతూ, బి.టికె. తర్వాత సినిమాల్లోకి రావాలని 8ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా. మా శ్రీకాకుళంలోని అమ్మవారికి మొక్కుకున్నా. ఆ అమ్మ దీవెనలవల్లే మా ఊరు పాలకొండలో షూట్ జరిగేలా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అందులోనూ సుమగారితో నటించడం మర్చిపోలేనిది. రిలీజ్ అయిన రోజే పాలకొండ, శ్రీకాకుళం, విజయనగరంలో హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌కుమార్‌కు నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
హీరోయిన్ షాలిని మాట్లాడుతూ, అచ్చమైన తెలుగుదనం వున్న సినిమా. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుంది. సుమగారితో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
భువన్ మాట్లాడుతూ, కోపానికి ప్రతీకగా నా పాత్ర వుంటుంది. ప్రతి ఒక్కరూ సినిమాటోగ్రఫీ గురించి, దర్శకుడు గురించే మాట్లాడుతున్నారు. సుమ గారి పాత్ర అల్టిమేట్. ప్రివ్యూ రోజు సుకుమార్ ఈ చిత్ర దర్శకుడిని అభినందించడం విశేషమని అన్నారు.
జబర్‌దస్త్ త్రినాథ్ మాట్లాడుతూ, ఈ సినిమాతో నా పాత్ర పేరు జమ్మడుగా మారిపోయింది. అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు. సుమగారి వల్లే ఈ సినిమా బాగా పాపులర్ అయింది. మిగిలిన ఆర్టిస్టులకూ పేరు రావాలని ఆమె పబ్లిసిటీకి సహకరించడం విశేషమని అన్నారు.
ఈ సందర్భంగా జయమ్మ పంచాయితీ షూటింగ్ విశేషాలను తెలియజేస్తూ రచయిత రాసిన పుస్తకాన్ని సుమ ఆవిష్కరించారు.