టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు మూడేళ్ళ విరామం తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి పెళ్లి సందడి అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో అంటూ ఓ ట్వీట్ చేశారు.
గత 1996లో శ్రీకాంత్ హీరోగా పెళ్లి సందడి చిత్రాన్ని రాఘవేంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు అంతగా పేరులోని శ్రీకాంత్... ఆ చిత్రం తర్వాత హీరోగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇపుడు ఇదే పేరుతో కొత్తగా చిత్రాన్ని నిర్మించనున్నారు.
నిజానికి గత మూడేళ్లుగా ఆయన దర్శకత్వ శాఖకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కొత్త చిత్రం గురించి ప్రకటన చేస్తానని రాఘవేంద్రరావు గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. 'పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...' అని తెలిపారు.
అంటే తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో, ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ సినిమా రానుందని ఆయన చెప్పారు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు.
ఇదిలావుంటే, పెళ్లి సందడి టైటిల్‌తో కె.రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు వెలువడిన ప్రకటన టాలీవుడ్‌లో ఓ సంచలనమైంది. ఇక ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్‌లో అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమధ్య నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.
ఈ కొత్త 'పెళ్లిసందడి'కి రోషన్‌ని కె.రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్‌కు ఆ 'పెళ్లిసందడి' ఎంతగా హెల్ప్ అయిందో.. ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ 'పెళ్లిసందడి' కూడా అంతగానూ హెల్ప్ అవుతుందని చెప్పచ్చు!