మెగా హీరోలకే కాదు అందరికీ గట్టి పోటీ ఇస్తున్న కన్నడ స్టార్
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (16:27 IST)
Heros photos
ఒకప్పుడు కన్నడ సినిమాలంటే తెలుగు సినిమాకి ఐదేల్ళు వెనుకవుండేవారంటూ కథల విషయంలో ప్రచారం వుండేది. రానురాను ఇప్పుడు కన్నడ చిత్రం తెలుగు సినిమాను శాసించేస్థాయికి చేరుకుంది. ఇదంతా కాల మహిమే. తెలుగులో మెగా హీరోలేకాదు, ఇతర హీరోలుకూడా భయపడేలా కన్నడ స్టార్ యశ్ చిత్రం కెజి.ఎఫ్.2 ఛాలెంజ్ విసురుతుంది. ఈ సినిమా వసూళ్ళు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమాకూ పోటీగా నిలిచింది. కెజి.ఎఫ్.2 సినిమా విడుదలకు ముందు ఆర్.ఆర్.ఆర్. ఇన్నిరోజుల గేప్ తర్వాత రావాలనే అంతర్లీనంగా జరిగిన ఒప్పందం ప్రకారం విడుదలయిందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేశాయి. ఇందుకు బెంగుళూరులో జరిగిన కెజి.ఎఫ్.2 ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా అక్కడి మీడియా అడిగిన ఓప్రశ్నకు దర్శకుడు నీల్ ఆర్.ఆర్.ఆర్. కోసమే వాయిదా వేశామని చెప్పాడు.
సో. రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయితే థియేటర్ల సమస్య, కలెక్షన్ల సమస్య వుంటుంది. అందుకే వేరువేరు డేట్స్‌లో విడుదలయ్యాయి. అయితే ఇప్పటివరకు ఆర్.ఆర్.ఆర్. కలెక్షన్లు సునామి అంటూ కొన్ని లెక్కలు చెప్పారు. బాలీవుడ్‌లోనూ ఇతర చోట్ల బాగానే ఆడినా తెలుగులో మాత్రం పెద్దగా అనుకున్నంత వసూళ్ళ రాబట్టలేకపోయింది. అందుకు కారణం. కథకు పెద్దగా తెలుగురువారు కనెక్ట్ కాలేకపోవడమే అని తెలుస్తోంది.
ఇక తెలుగులో భారీ పారితోషికం, చిత్రం లాభాల్లో వాటా తీసుకున్న మెగా హీరోలకు ఇప్పుడు యశ్ పెద్ద గట్టి పెద్ద ఇచ్చినట్లయింది. వసూళ్ళ పరంగా భీమ్లానాయక్‌ను బీట్ చేయడంతోపాటు ఆర్.ఆర్.ఆర్.ను బీట్ చేయడం విశేషం. నైజాంలో భీమ్లా గరిష్టంగా 33 కోట్లకు పైగా అని లెక్కలు చూపించారు. కానీ నిజానికి కోటిన్నర తక్కువే అని ట్రేడ్ వర్గాల తెలియజేస్తున్నాయి. ఈ వీకెండ్ కేజీఎఫ్ 2 గట్టిగా వుండడంతో నైజాంలో పుష్ప టోటల్ రన్‌ను కూడా దాటేసేంది. కేజీఎఫ్ 2 అయిదు రోజులకే 30 కోట్లు వసూలు చేసింది నైజాంలో.
విశాఖ ఏరియాకు భీమ్లా ఆరు నుంచి ఏడుకోట్ల మధ్యలో చేసింది. కేజీఎఫ్ 2 ఇప్పటికే ఆరు కోట్లకు చేరిపోయింది. అక్కడ పుష్ప సినిమా ఏడున్నర కోట్లు చేసింది. దాన్ని కూడా దాటేస్తుందని టాక్. అదేవిధంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులలో కూడా కె.జి.ఎప్. తెలుగులోని అగ్ర సినిమాల కలెక్షన్లను దాటేసింది. ఇక ఇటీవలే విడుదలైన గని కూడా వరున్‌తేజ్ అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని అనుకున్నారు. కానీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని హీరోనే సోషల్‌మీడియాలో వెల్లడించారు.
ఇక ఇవన్నీ గమనిస్తున్న తెలుగు హీరోలు అందరూ ఆలోచనలో పడ్డారు. ప్రభాస్ బాహుబలి తర్వాత అంతస్థాయిలో ఆయన సినిమా విజయం కాలేదు. మొన్నవచ్చిన రాధేశ్యామ్ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్.వంటి ఎన్ని సినిమాలు చేసినా కేవలం సింగిల్ హీరోతోనే యశ్ రికార్డులను బీట్ చేయడం మింగుడుపడని విషయంగా మారింది. కనుకనే ఇప్పుడు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తతోపాటు టెక్నికల్‌గానూ, హింసను ఎక్కువగా ప్రేరేపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణ అఖండ సినిమా ఇందుకు ఉదాహఱణగా చెబుతున్నారు. అందులో హింస మామూలు స్థాయిలో లేదు. కానీ సెంటిమెంట్, దైవభక్తి దానికి తోడుకావడంతో బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాస్ చిత్రంగా నిలిచింది.
ఇక నాని, శర్వానంద్, రామ్ వంటి యూత్ హీరోలుకూడా తాము ఎటువంటి చిత్రాలు తీయాలనేది ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో విజయ్‌దేవరకొంగ బతికిపోయాడని ఎగ్జిబిటర్ సెక్టార్‌కు చెందిన ప్రసన్నకుమార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఓ రేంజ్‌లో ఆయన్ను బాలీవుడ్ స్థాయికి తీసుకెళితే గీత గోవిందం తర్వాత ఆయన స్థాయి మరింత పెరిగింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో చేస్తున్న లైగర్ చిత్రం పాన్ ఇండియా స్టార్‌ను చేసేంది. ఆ స్పీడ్‌లోనే రెండు భారీ సినిమాలు కూడా విజయ్ దేవరకొండ చేతిలో వున్నాయి. అవికూడా పాన్ ఇండియా సినిమాలే. ఇంతకుముందు తెలుగు హీరోలకు విజయ్ పెద్ద సవాల్‌గా మారితే, ఇప్పుడు యశ్ తోడుకావడం విశేషమేమరి.