రజనీకాంత్, కమల్ హసన్, చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, మోహన్ లాల్.. ఈ హీరోల పక్కన నటించే అవకాశం వస్తోందంటే ఏ హీరోయినైనా ఎగిరి గంతేస్తారు. ఇక వీరి పక్కన నటించే అవకాశం రెండోసారి కూడా వచ్చిందంటే జన్మ తరించినట్లే అనుకుంటారు. ఎందుకంటే ఒక బడాహీరో పక్కన స్టార్‌గా నటిస్తే చాలు ఏ హీరోయిన్ వాల్యూ అయినా ఆకాశానికి గెంతేసినట్లే.. ఆ విషయం మన కాజల్, మన రకుల్, మన తమన్నాలను అడిగితే అందరికంటే చక్కగా చెప్పేస్తారు.
కానీ ఒక కుర్ర హీరోయిన్ అలాంటి ముసలినటుల పక్కన నటించడమా.. అప్పుడే.. నెవర్.. నా విలువ ఏం కానూ అంటూ వివిధ భంగిమలతో ప్రకటనలు జారీ చేయడం వింత గొలుపుతుంది. అదే సమయంలో ఆ అమ్మాయి గట్స్ చూసి సంతోషం వేస్తుంది కూడా. ఇది ఏ బాలీవుడ్ హీరోయిన్ మాటో కాదో.. ప్రభాస్ ఎవరు అంటూ అనుకోకుండా క్వశ్చన్ మార్కు వేసి అభాసు పాలై నష్ట నివారణ చేసుకున్న ఆత్మవిశ్వాసి నిత్యామీనన్ కాదు. కీర్తి సురేష్.
రజనీమురుగన్, రెమో చిత్రాల విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయిపోయిన కీర్తి తర్వాత విజయ్‌తో నటించే అవకాశాన్ని అంది పుచ్చుకుంది. తాజాగా తమిళ నటుడు విక్రమ్‌కు జంటగా స్కెచ్ సినిమాలో నటించే అవకాసం ముందుగా ఆమెనే వరించింది కానీ సీనియర్ కథానాయకులతో నటించరాదని నిర్ణయించుకున్నానంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుల ముఖం మీదే చెప్పి ఆ అవకాశాన్ని వదులుకుంది కోలీవుడ్ కోడై కూస్తోంది.
అదే సమయంలో కీర్తికి టాలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తున్నాయి. రావడం రావడం.. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్టకు జంటగా నటించే అవకాశం రాగా సీనియర్ నటుడన్న కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించడం సంచలనం గొలుపుతోంది. సీనియర్ హీరోలతో ఒక్క చాన్సు వస్తే చాలు అయిదారేళ్లు డోకా లేకుండా బతికేస్తామని కుర్ర హీరోయిన్లు అందరూ కలలు కంటూంటే ఒక్క కీర్తి సురేష్ మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నట్లు..
ఈ ప్రశ్నకు ఆమె చెబుతున్న సమాధానం వింత గొలుపుతోంది. సీనియర్ హీరోలతో నటించాలని తనకు మాత్రం ఉండదా ఏంటి, ఆదిలోనే అలా వారికి జంటగా నటిస్తే, యువ నటులకు జంటగా నటించే అవకాశాలను మిస్ అవుతానేమోనన్న భావనతో ఆ అవకాశాలను ఒప్పుకోవడం లేదని కీర్తీ చెప్పుకొచ్చింది. కాస్త గుర్తింపు, పేరూ వస్తే వారూ వీరు అని వయసుతో పని లేకుండా కథా బలమున్న చిత్రాలకే నా ఓటు అంటున్న కీర్తి గుండె ధైర్యానికి, ఆత్మ విశ్వాసానికి వీరతాడు వేయాల్సిందే మరి.