పాతాళభైరవి ఆయన దర్శకత్వంలో రూపొందింది. 200రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అదే. 10 సెంటర్లలో వందరోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తమిళంలో కూడా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఇక ఆయన నేతృత్వంలో రూపొందిన `మాయాబజార్` ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందులో శ్రీకృష్ణుడు అవతారంలో ఎన్.టి.ఆర్.కు ఓ మైలురాయిలా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరెస్ట్‌లా నిలిచిందనే చెప్పాలి. తొలి చిత్రం భక్త పోతనలోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు చారిత్రక, జానపద, పురాణాలు, సాంఘికాలతో ఆయన ప్రయోగాలు చేశారు. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చారు. వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. జై పాతాళభైరవీ అన్నారు. అమ్మవారు, నరుడా ఏమి నీ కోరిక అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది.
సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. కాలక్రమేణా ఆయన సినిమాలు కొందరినీ ఆకట్టుకోలేకపోయాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయాయి. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. ఆయన సినిమాలు ఎప్పటినీ ఎవర్‌గ్రీనే. అందుకే మహానటి సినిమాలో కె.వి.రెడ్డి పాత్రను దర్శకుడు క్రిస్ పోషించి గుర్తు చేశారు. విజయవంతమైన సినిమాలు తీసిన ఆయన 1972 సెప్టెంబర్ 15న కాలం చేశారు.