కాలేజీ గర్ల్, గ్లామర్ డాల్, పల్లెటూరు యువతి, ఆధునిక మహిళ, ఉద్యోగిని వంటి ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన పాత్రలను చేయడం పెద్ద కష్టం కాకపోపచ్చు కానీ అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలీనిదానిలా నటించడం చాలా కష్టం అంటున్నారు లావణ్య త్రిపాఠి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో మొబైల్స్, కంప్యూటర్లు వంటి మోడ్రన్ డివైస్‌ల గురించి నిజ జీవితంలో బాగా తెలిసి ఉండి కూడా వాటి గురించి ఏమీ తెలీని అమ్మాయిలా నటించిన లావణ్య సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి పేరు కొట్టేశారు.
‘‘మిస్టర్ సినిమా కోసం దర్శకుడు శ్రీను వైట్లగారు కథ చెబుతునప్పుడు... ఈ రోజుల్లో మొబైల్స్, కంప్యూటర్స్ గురించి ఏం తెలియని అమ్మాయి ఎలా ఉంటుందోనని ఆలోచించా. ఆ ఆలోచనే చంద్రముఖి పాత్ర అంగీకరించడానికి కారణమైంది. ఏమీ తెలియని అమ్మాయిలా నటించడమంటే సవాలే. ఆ సవాల్‌ను నేను స్వీకరించా’’ అన్నారు లావాణ్యా త్రిపాఠి. వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘మిస్టర్’లో లావణ్య ఓ హీరోయిన్‌గా, హెబ్బా పటేల్ మరో హీరోయిన్‌గా నటించారు. మిస్టర్ సినిమా గత శుక్రవారం విడుదల కావడం తెలిసిందే.
మనసుపెట్టి, కష్టపడి చేసిన మిస్టర్ సినిమా బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉందని లావణ్య చెప్పారు. ఇప్పటి వరకూ నేను చేయనటువంటి పాత్రను ‘మిస్టర్’లో చేశా. సినిమాలో ఎక్కువగా హాఫ్ శారీస్‌లో కనిపిస్తా. ఇందులో రాజ వంశానికి చెందిన అమ్మాయిని కాబట్టి... దుస్తులు, నగలు అందుకు తగ్గ సై్టల్‌లో డిజైన్ చేయించాం. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు. పాత్రకు తగ్గట్టు నటించాలి అన్నారామె.