"స్థానికం" పూర్తయ్యేంత వరకు కొత్త జిల్లాలు వద్దు.. పాత ప్రాదికనే "ఎన్నికలు"

మంగళవారం, 17 నవంబరు 2020 (09:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో షాకిచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను షూరు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. 
 
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని... అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. 
 
గత ఎన్నికల్లో వైకాపా ఇచ్చిన హామీ మేరకు... ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి... మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం పలువురు సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ సన్నాహాలపై ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
'13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేనిపక్షంలో జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు' అని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు