చరిత్ర సృష్టించిన తెలుగోడు... ‘ఇండియన్‌ ఐడల్‌’గా రేవంత్, మూడో స్థానంలో రోహిత్‌

సోమవారం, 3 ఏప్రియల్ 2017 (08:56 IST)
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్‌ ఐడల్‌’లో మరో తెలుగోడు సత్తా చాటి... ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌‌ను కైవసం చేసుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రంలో ‘మనోహరి’.. ‘దమ్ము’లో ‘రూలర్‌ (మూవీ వెర్షన్‌)’ సహా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడి సత్తా చాటిన సింగర్ ఎల్.వి.రేవంత్.. ఇండియన్‌ ఐడల్‌ 9 విజేతగా నిలిచాడు. హిందీ భాష మీద అంతగా పట్టు లేకున్నా.. ఉత్తరాది గాయకుల నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరిదాకా నిలిచి గెలిచాడు. 
 
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారితో పాటు... ప్రేక్షకుల అభిమానమూ పొందిన రేవంత్‌ను ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 9 గ్రాండ్‌ ఫైనల్‌లో విజేతగా మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రకటించాడు. రేవంత్‌తో పోటాపోటీగా నిలిచిన ఖుదాబక్ష్‌ (పంజాబ్‌) ఫస్ట్‌రన్నరప్‌గా నిలువగా, మరో తెలుగువాడైన పీవీఎన్‌ఎస్‌ రోహిత్ రెండో రన్నరప్‌గా నిలిచాడు. 
 
కాగా, శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్‌.. హైదరాబాద్‌లో గాయకుడిగా స్థిరపడ్డారు. పోటీలో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్‌ ఐడల్‌ బిరుదుతోపాటు రూ.25లక్షల నగదు బహుమతిని రేవంత్‌ దక్కించుకున్నారు. సోని మ్యూజిక్‌ సంస్థతో పాటల ఒప్పందాన్ని కూడా గెలుచుకున్నారు. మహీంద్ర కేయూవీ100 వాహనం కూడా కానుకగా దక్కింది. రేవంత్‌కు ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. 
 
దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఇంటికి వెళ్లి నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విజయంపై సంబరాలు చేసుకుంటా. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడతా, అంతకు ముందు తన హిందీని మెరుగుపరచుకోవాల్సి ఉన్నదన్నాడు. అలాగే, తమకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’’ అని రేవంత్‌ అన్నారు. ఇండియన్‌ ఐడల్‌గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంతే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి