నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఎలా వుంది అని అడిగితే...?
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:50 IST)
Macharla niyojakavargam poster
హీరో నితిన్ `భీష్మ`, రంగ్‌దే సినిమాల తర్వాత మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం` లో నటించాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించారు. అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేసింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ
మాచర్ల నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళక్రితం తన తండ్రి చనిపోవడంతో బై ఎలక్షన్లో రాజప్ప (సముద్ర కని) నిలబడి గెలుస్తాడు. అప్పటినుంచి అతను చెప్పిందే రూల్. ఆ తర్వాత జరిగే ఎలక్షన్లలో పోటీలేకుండా తానే గెలుస్తుంటాడు. ప్రజలను భయభ్రాంతులను చేసి ఎదురుతిరిగితే చంపేస్తాడు. ప్రభుత్వం యంత్రాంగం కూడా ఏమీ చేయలేని స్థితి. అలాంటి చోటికి వైజాగ్ నుంచి తన ప్రియురాలు స్వాతి (కృతిశెట్టి)కోసం సిద్ధార్గ్ రెడ్డి (నితిన్) రావాల్సివస్తుంది.
వచ్చీరాగానే అక్కడ రాజప్పను ఎదిరిస్తాడు. ఆ టైంలోనే తనకు కలెక్టర్‌గా అక్కడే పోస్టింగ్ వచ్చిందని తెలుస్తుంది. ఇక ఇగోకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజప్ప, కలెక్టర్ సిద్ధార్గ్ రెడ్డి (నితిన్)ను చంపుతానని సవాల్ విసురుతాడు. తాను కలెక్టర్‌గా ఇక్కడ ప్రజాస్వామ్యప్రకారం ఎలక్షన్లు జరిపిస్తానని ప్రతిసవాల్ విసురుతాడు. ఇక ఆ తర్వాత ఏమయింది? కలెక్టర్ ప్రేమాయణం ఎంత వరకు వచ్చింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
సినిమా మొత్తంగా చూస్తే, కథ ప్రకారం తీసుకుంటే ఇది ఫక్తు వర్తమాన రాజకీయ ముఖ చిత్రం. దేశంలోని పలు చోట్ల అసలు ఎలక్షన్లే జరగకుండా ఏకఛత్రాధితప్యం వహించాలనుకునే రాజకీయనాయకుల ముఖ చిత్రమే ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమధ్య పోటీలేకుండా చిన్న పాటి ఎలక్షన్లకు పోలింగ్ బూత్‌కు కూడా జనాలు రాకుండా అడ్డుకున్న కొన్ని సంఘటనలు, పోటీకి ఎవరైనా నిలబడితే హతమార్చడం వంటివి రాజకీయ అవగాహన వున్న ఎవరికైనా ఇంకా కళ్ళముందు మెదులాడుతూనే వున్నాయి. అలాంటి అంశాన్ని తీసుకుని ఇప్పుడు సినిమా చేయడం నిజంగా సాహసమే.
- కలెక్టర్‌గా తన విధి ఏమిటనేది చెప్పి, ప్రజలకు మేలు చేయాలనుకునే కుర్రాడికథ. ఇంతకుముందు రవితేజ సబ్ కలెక్టర్‌గా తన హోదాకు తగిన విధంగా చేసి చూపించాడు. అంతకు ముందు చాలా సినిమాలు ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కలెక్టర్‌గా నితిన్ ఏం చేశాడనేది తెలిపాడు.
- హీరోయిన్లుగా నటించిన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసాల గురించి చెప్పాలంటే, నితిన్, కృతి శెట్టి లవ్ ట్రాక్, ఆమె బావ ఇగోయిస్ట్ వెన్నెల కిశోర్ ట్రాక్ అలరిస్తుంది. కేథరిన్ థ్రెసాను ఎందుకు తీసుకున్నారో అర్థంకాదు. సముద్రకని పాత్ర రెండు షేడ్స్ వుంటాయి. మిగిలిన పాత్రలన్నీ మామూలుగానే వున్నాయి.
- పాటలు, సంగీతం సర్వాలేదు అనిపిస్తాయి. మొత్తంగా సినిమా చూస్తే, సరిలేరునీకెవ్వరూతోపాటు కొన్ని సినిమాల సన్నివేశాలు గుర్తుకువస్తాయి. యాక్షన్ పార్ట్ ఆకట్టుకుంటుంది. కథలో సరైన బలంలేకపోవడం, ట్విస్ట్‌లు వుండకపోవడం వంటివి సినిమాకు లోపం. మరి ఈ సినిమా ఏమేరకు అలరిస్తుందే చూడాలి.