కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు ధీటుగా తీర్చి దిద్దుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇందులోభాగంగానే గుంటూరు జిల్లా తెనాలిలోని రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తోందన్నారు. తెనాలి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన పెమ్మసాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్దేశించన ప్రకారం.. డిసెంబర్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన మరిన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని దేశాల నేతలు ఓర్చుకోలేక పోతున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ముఖ్యంగా, అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకు భారత్ వృద్ధి అస్సలు నచ్చడం లేదని అన్నారు. తమతో సమానంగా భారత్ మారకూడదనే అహంకారంతో దేశాభివృద్ధిని కుంటుపడేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందన్నారు. అందువల్ల ఇపుడు మన ఆర్థిక ప్రయోజనాలపైనే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మన దేశాన్ని తయారీ, ఆవిష్కరణ శక్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన మేకిన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లోనే స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశ రక్షణ ఎగుమతులు రూ.24 వేల కోట్లు దాటాయని, ఇవి రక్షణ రంగ బలాన్ని, అభివృద్ధిని సూచిస్తాయని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో రైలు, మెట్రో కోచ్ తయారీ యూనిట్ గ్రీన్ ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. 60 హెక్టార్లకు పైగా విస్తరించినవున్న ఈ ఫ్యాక్టరీ మెట్రో రైళ్లు, వందే భారత్ రైళ్లకు కోచ్‌లను తయారు చేస్తుంది. రూ.1800 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.