ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం "మహిళా కబడ్డీ". ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ శనివారం దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్‌లో జరిగింది. పోస్టర్‌ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ ఛైర్మన్ బాలమల్లు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, ఆలీ ఖాన్, మాజీ హీరోయిన్ రంజని, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి బాలమల్లు మాట్లాడుతూ, ఆర్కే గౌడ్ చాలా కాలంగా నాకు మంచి మిత్రుడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దర్శక నిర్మాతగా అయన తెరకెక్కిస్తున్న "మహిళా కబడ్డీ" పాటలు ఇటీవలే విన్నాను. చాలా బాగున్నాయి. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చాటిచెప్పే సినిమా ఇది. తప్పకుండా మహిళా కబడ్డీ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే, దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, "మహిళా కబడ్డీ" పేరుతొ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ వంటి ప్రముఖ గాయనీమణులు పాడిన ఆరు పాటలను రికార్డింగ్ చేశాం. దాంతో పాటు ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి.
జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది. ఆమె జర్నీలో ఎదుర్కొన్న సమస్యలు, మలుపులు ఏంటి అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది. రచన స్మిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను త్వరలోనే పూర్తి చేసి విడుదల చేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం రాజ్‌కిరణ్, నిర్మాత, దర్శకత్వం : ప్రతాని రామకృష్ణా గౌడ్.