క్యారెక్టర్ పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన నటుడు రాళ్ళపల్లి నరసింహారావు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో పాటు... వృద్ధాప్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు వయసు 73 యేళ్లు. దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి.. అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. ఆయన భౌతికకాయాని సినీ రంగానికి చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు.
1945లో తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించిన రాళ్ళపల్లి.. పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. "కుక్కకాటుకు చెప్పుదెబ్బ" అనే చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. 'ఊరుమ్మడి బతుకులు' అనే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. నాటకరంగంలో విశేష అనుభవం ఉండడంతో ఆయనకు చిత్రసీమలో ఎదురులేకుండా పోయింది.
రాళ్లపల్లి తన సినీ కెరీర్‌లో సుమారు 800కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పాత్ర ఏదైనా ప్రాణప్రతిష్ట చేసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన "భలేభలే మగాడివోయ్" చిత్రం. ఆపై వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు.