నన్ను మోసం చేసి లాక్ చేసేశాడు... మెగాస్టార్ చిరంజీవి
సోమవారం, 27 ఆగస్టు 2018 (19:48 IST)
16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆటపాటలతో.. తారల తళుకుబెళుకుల నడుమ అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జానకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇంకా పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు... రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు అవార్డులు అందిచడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను. ఇవ్వనంటేనే వస్తానని సురేష్‌కి ముందే చెప్పాను. కానీ నన్ను మోసం చేసి గానగోకిల ఎస్. జానకి చేతుల మీదుగా అవార్డు బహుకరించి నన్ను లాక్ చేసేసాడు. కాదనలేక ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగాను ఉంది.
ఇప్పటివరకూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. సింగపూర్లో ఏదో వార్డుల కార్యక్రమంలోనే ఇద్దరం కలిసాం. మళ్లీ సంతోషం వేడుకల్లోనే కలిసాం. తొలిసారి ఆమె చేతుల మీదగా సంతోషం అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా సురేష కు ధన్యవాధాలు తెలుపుతున్నా. మరొకరు చేతులు మీదుగా ఇచ్చుంటే తిరస్కరించేవాడిని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది. వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది. వాళ్లను చూసి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్తతరం నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిశ్రమకు ఎంతైనా అవసరం.
`సంతోషం` వేడుకల్లో తొలిసారి అందాల తార శ్రీదేవి పేరు మీద స్మారక అవార్డును నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది హీరోయిన్లతో కలిసి నటించాను.. కాని ఆమెతో నటించిన ఆ నాలుగు సినిమాల అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అందులోనూ `జగదీక వీరుడు.. అతిలోక సుందరి` సినిమా ఓ మధుర జ్ఞాపకం. శ్రీదేవి కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో? చివరివరకూ అలాగే ఉన్నారు. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కొందరి హీరోయిన్లలలో మార్పులొస్తాయి. కానీ శ్రీదేవిలో ఎలాంటి మార్పులు రాలేదు. డౌన్ టు ఎర్త్ గానే నడుచుకున్నారు. ఆమెను చూసి నేను కొన్నికొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆమెకు ఓపిక.. సహనం ఎక్కువ. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు.
సౌత్ ఇండియాలో నెంబర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. నార్త్ ఇండియాలోనూ నెంబర్ వన్ హీరోయిన్లు ఉన్నారు. ఇలా నెంబర్ వన్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా శ్రీదేవి ఒక్కరే ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా కీర్తింపబడడ్డారు. ఆమె అవార్డును తమన్నా అందుకోవడం సంతోషంగా ఉంది.
సంకల్ప్‌ను ఓసారి మీలో రానా పరిచయం చేసాడు. తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో చూసాను. అతను మాటల మనిషికాదు.. చేతల మనిషి. తన పనితనాన్ని `ఘాజీ` సినిమాతో చాటి చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పడు మా వరుణ్ తేజ్‌తో స్పేస్ బ్యాక్ డ్రాప్‌లో `అంతరిక్షం` సినిమా చేస్తున్నాడు. కొన్ని విజువల్స్ చూసాను. చాలా బాగున్నాయి. ఘాజీ కన్నా ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా.
రామ్ -లక్ష్మణ్ ఎక్కడో వేటపాలెం నుంచి మద్రాస్ వచ్చి ఫైట్ మాస్టర్లు అయ్యారు. అప్పట్లో నాకు రాజు అనే స్టంట్ మాస్టర్ ఎక్కువగా ఫైట్లు కంపోజ్ చేసేవారు. ఆయన వద్ద సహాయకులుగా చేరి.. గొడుగు పట్టిన వాళ్లు ఈరోజు ఇంత మంచి స్థానానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హీరోలంతా రామ్ లక్ష్మణ్ డేట్లు అడుగుతున్నారు. లేదంటే వాయిదా వేసుకుంటున్నారంటే వాళ్లు ఎంత గొప్పవాళ్లు అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. వీళ్లు ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని` చిరంజీవి ముగించారు.