గానగంధర్వుడు, సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్‍కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో సపోర్టుతో ప్రత్యేక ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
కరోనా వైరస్ బారినపడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఎక్మో సపోర్టు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశాయి.
ఆయనకు ఎక్మో సపోర్టు సాయంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్‌లో వెల్లడించారు. బాలు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, భిన్న వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా, తమ వైద్య బృందం ఈ విషయంలో అంతర్జాతీయ వైద్య నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించిన వైద్య నిపుణులతో తమ డాక్టర్లు మాట్లాడుతున్నారని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాము అందిస్తున్న చికిత్స విధానంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారని వెల్లడించింది.