బాలు ఆరోగ్యంపై బాబు - హరీష్ ఆందోళన : నేడు సామూహిక ప్రార్థనలు
గురువారం, 20 ఆగస్టు 2020 (12:52 IST)
గానగంధర్వుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఎంజీఎం కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఇదే విషయాన్ని ఆస్పత్రి వైద్యులు పదేపదే చెబుతున్నారు. దీంతో బాలు ఆరోగ్యం పట్ల కోట్లాది మంది అభిమానులతో పాటు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావులు కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ, బాలు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. 'బాల సుబ్రహ్మణ్యంగారి ఆరోగ్యం గురించి ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశమంతా ఆందోళన చెందుతోంది. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
'తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో పాటలు పాడి కొన్ని దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తోన్న గొప్ప గాయకుడు బాలసుబ్రహ్యణ్యం త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను' అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఇదిలావుండగా, ఎస్.పి.బాలు త్వరగా కోలుకుని తిరిగి మనమధ్యకు రావాలని, తిరిగి గళంతో సినీ పాటలు ఆలపించాలని కోరుతూ అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన సినీ కళాకారులు గురువారం సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు కె.భారతీరాజా ఓ ప్రకటన విడుదల చేశారు.
'ప్రేమ విత్తనాలు నాటడం మాత్రమే ఎస్పీబీకి తెలుసు. ఆయన గొప్ప కళాకారుడు. త్వరలో ఆయన మన మధ్యకు తిరిగి రావాలి. మనం ఆయన్ను వెనక్కి తీసుకొద్దాం. ఎస్పీబీని మనకు ఇవ్వమని ప్రకృతిని ప్రార్థిద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని బుధవారం ఎంజిఎం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని చిత్రసీమ ప్రముఖులు, సంగీత ప్రియులు గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రార్థనలు చేయమని భారతీరాజా పిలుపు ఇచ్చారు.
తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపు ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం పలువురు సంగీత దర్శకుడు, గాయనీగాయకులు, సంగీత కళాకారులు తమ తమ ఇళ్ళల్లో ప్రార్థనలు చేశారు. భారతీరాజా మాట్లాడుతూ 'గురువారం సాయంత్రం ఆరింటికి నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు, లక్షలాది మంది ఎస్పీబీ అభిమానులు ఆయన పాటలు ప్లే చేద్దాం. ఎవరి ఇళ్ళల్లో వాళ్లు ఉండి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.
ఇందులో ఇళయరాజా, రజనీకాంత్, కమల్ హాసన్, వైరముత్తు, ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఈ సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కోరుతున్నా. ఎంజీఆర్ ఆస్పత్రి పాలైనప్పుడు ఈ విధంగానే ప్రార్థన చేశాం. ఆయన ఆరోగ్యంగా తిరిగొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎస్పీబీ కోలుకోవాలని ప్రార్థిద్దాం. కులమతాలు, భాషలకు అతీతంగా ఎస్పీబీ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఆయన గొంతు మళ్లీ వినపడాలి' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.