డబ్బున్నవాళ్లకే మంచి దర్శనమా?.. టీటీడీ తీరుపై మోహనబాబు ఫైర్‌

సోమవారం, 9 జనవరి 2017 (05:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకే టీటీడీ అధికారులు తిరుమలలో మంచి దర్శనం కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం వేకువజామున ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హయాంలో ఉన్నట్లుగా తితిదే అధికారుల పరిపాలన ఇప్పుడు లేదన్నారు. 
 
ఆలయ ప్రవేశం చేసే ముందు ధ్వజస్తంభాన్ని తాకడం సంప్రదాయమని, అయితే టీటీడీ కొంతమందికే ఆ అవకాశాన్ని కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ధ్వజస్తంభం తాకాలని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. 
 
శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రతి అధికారీ (ఈవో, జేఈవో) తనకిష్టమైన విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. గుడికి వచ్చినప్పుడంతా ఇలాంటి ఆవేదనే తనకు కలుగుతోందన్నారు. మంచీచెడు దేవుడు చూస్తుంటాడని, తన క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్వామిపైనే ఉందని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి