ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

దేవీ

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (13:49 IST)
Priyadarshi, Sivalenka Krishnaprasad, Rupa Kodavayur, Indraganti , Avasarala
నమ్మకం మంచిదే. మూఢ నమ్మకం మంచిది కాదనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాం. మన జీవితం.. మన చేతుల్లోని రేఖలు బట్టి కాదు... మన చేతల్లో రీతులు బట్టి ఉంటుందని చెప్పాం. ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు. ఈ చిత్రానికి ఓ ఆంగ్ల కథ ప్రేరణ. చంద్రుడ్ని చేరుకునేంత సైన్స్ ఒకవైపు... పాతకాలాన్ని మించిపోయే మూఢ నమ్మకాలు మరోవైపు. ఈ రెంటి మధ్య వైరుధ్యాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశాం"  అని దర్శకుడు ఇంద్రగంటి అన్నారు.
 
ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం "సారంగపాణి జాతకం". "జెంటిల్ మ్యాన్, సమ్మోహనం" చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ - శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నటీనటులు తెలియజేశారు. ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఛాయాగ్రాహకుడు పి.జి.విందా,  అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని, అశోక్ కుమార్, ప్రదీప్ రుద్ర, నివితా మనోజ్, సమీర భరద్వాజ మాట్లాడారు.
 
చిత్ర ఛాయాగ్రాహకుడు పి.జి.విందా మాట్లాడుతూ... "అష్టాచెమ్మా, అమీతుమీ" తర్వాత ఇంద్రగంటి గారితో నేను చేసిన మూడో సినిమా "సారంగపాణి జాతకం". శ్రీదేవి మూవీస్ లో కూడా నాకిది మూడో చిత్రం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత మంచి సినిమా ఇది. ఈ చిత్రానికి పని చేయడం నాకు గర్వకారణం. దర్శి నుంచి కోరుకునే కామెడీ ఇందులో పుష్కలంగా ఉంటుంది" అన్నారు.
 
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... "నిర్మాతగా నా సెకండ్ ఇన్నింగ్స్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ "జెంటిల్ మ్యాన్"తో స్టార్ట్ అయ్యింది. "సమ్మోహనం"తో విజయపరంపర కొనసాగింది. సమంత "యశోద" కూడా మంచి విజయం సాధించింది.  "సారంగపాణి జాతకం" మా ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా. మోహన్ ఈ కథ చెప్పిన మరుక్షణమే ఓకే చెప్పేశాను. మంచి రిలీజ్ డేట్ కోసం విడుదల వాయిదా వేశాం. ఎందుకంటే సకుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించాల్సిన మంచి సినిమా ఇది. నేను భగవంతుడ్ని, జాతకాల్ని నమ్ముతాను. మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఈ చిత్రం వాయిదా పడడం, ఇప్పుడు సమ్మర్ లో... కోర్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదలవుతుండడం భగవదేచ్ఛగా భావిస్తున్నాను. ఈ సినిమా చూశాక... "కృష్ణప్రసాద్ మామూలోడు కాదు" అంటారు. నిర్మాతగా నా 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్న మాట ఇది. నిర్మాతగా ఇప్పటికే నాకున్న పేరు, పరపతి పెంచే గొప్ప చిత్రం సారంగ పాణి జాతకం. ఒక గొప్ప సినిమా చేశాననే గర్వంతో చెబుతున్నాను. ఏప్రిల్ 18న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. ఫ్యామిలితోపాటు యూత్ ను కూడా ఆకట్టుకునే సినిమా ఇది" అన్నారు!
 
చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... "బందిపోటు" తర్వాత కూడా నన్ను నమ్మి కృష్ణప్రసాద్ గారు నాతో "జెంటిల్ మ్యాన్" చేశారు. "అమీతుమీ" తర్వాత చాలా గ్యాప్ తో నేను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ "సారంగపాణి జాతకం". "కోర్ట్" తర్వాత "న్యాయ ప్రియదర్శి" అనిపించుకున్న మా హీరో... ఈ చిత్రంతో మరోసారి "హాస్యప్రియదర్శి" అనిపించుకుంటాడు. ఇందులో అందరూ తెలుగువారే నటించారు. ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పుకున్నారు. ఈ చిత్రాన్ని వాయిదా వేయడం శివలెంక గారు తీసుకున్న సరైన నిర్ణయం. ఇందులో కామెడీ మాత్రమే కాదు, కథ కూడా ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు-సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడాల్సిన సినిమా "సారంగపాణి జాతకం". ఏప్రిల్ 18న మీ ముందుకు వస్తోంది" అన్నారు!
 
చిత్ర కథానాయకి రూపా కొడవాయూర్ మాట్లాడుతూ, ఈ సినిమాతో నా తెలుగు మరింత మెరుగుపడింది. ఈ చిత్రంలో నా కొత్త రూపాన్ని చూస్తారు. పరీక్షలతో ప్రెజర్ ఫీలయి ఉన్న ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా చూడాల్సిన సినిమా" అన్నారు.
 
చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ... "ఈ చిత్రాన్ని మా నిర్మాత ఎంత నమ్ముతున్నారో... నేను అంతకంటే ఎక్కువగా నమ్ముతున్నాను. ఇంద్రగంటి సినిమాలో నటించాలన్నది నా పదేళ్ల కల. ఓ నటుడిగా ఈ సినిమా నాకు ఎంతో నేర్పింది. సక్సెస్ మీట్ లో మరిన్ని సంగతులు పంచుకుంటాను" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు