తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె.సుకుమార్. ఈయన వద్ద శిష్యరికం చేసిన అనేక మంది యువకులు దర్శకులుగా మారి సత్తా చాటుతున్నారు. ఈ కోవలోనే ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ఒకరు. ఈయన తొలి చిత్రం "ఉప్పెన"తోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించింది.
ఉప్పెన చిత్రంతోనే దర్శకుడు బుచ్చిబాబు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా, మైత్రీ మూవీ మేకర్స్ తీసిన చిత్రాల్లో "డియర్ కామ్రేడ్", "సవ్యసాచి" చిత్రాలు మిగిల్చిన నష్టాలను ఈ ఉప్పెన భర్తీ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సంతోషకర సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డైరెక్టర్ బుచ్చిబాబుకు ఓ ఆఫర్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా సమాచారం సదరు సంస్థ బుచ్చిబాబుకు ఖరీదైన కారు, ఇల్లు, రెండింటిలో ఏదో ఒక ఆఫర్‌ను ఎంచుకోవాలని సూచించిందట. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని ఇండస్ట్రీకి అందించిన బుచ్చిబాబుకు ఈ రెండు గిఫ్టులు కలిపి ఇచ్చినా తప్పేమి లేదని పలువురు అభిప్రాయడుతున్నారు. కాగా, గతంలో "ఛలో" సినిమాకు వెంకీ కుడుముల, "ప్రతీ రోజూ పండగే" చిత్రానికి దర్శకుడు మారుతి కార్లు బహుమతిగా అందుకున్న విషయం తెల్సిందే.