ప్రముఖ కథానాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగబాబు ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మద్దతు తెలిపారు. భారత దేశానికి గొప్ప నాయకుడిగా మోడీ వచ్చారని.. ఆయన డిక్టేటర్ నియంతలా భారత్‌ను ప్రగతి బాటన పయనింపజేస్తున్నాడని మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ తీసుకున్న నిర్ణయం ఈ 70 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేదన్నారు. దేశానికి ఇలాంటి నాయకుడే కావలంటూ మోడీని ప్రశంసల్లో ముంచెత్తాడు.
పనిలో పనిగా తన సోదరుడు పవన్ కల్యాణ్‌పై నాగబాబు ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ రాజకీయ అరంగేట్రంపై నోరు విప్పారు. సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారనే ప్రశ్నకు నాగబాబు సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్‌లో మానవత్వం, గొప్ప భావజాలం, గొప్ప గుణం ఉందన్నారు. సాధారణంగా ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అంశాలను మనం వదలేస్తుంటామని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ అలా కాదని.. దేన్నీ అంత సాధారణంగా, సులభంగా వదలడని చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో, అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వలనో జనసేనను పవన్ స్థాపించలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని, ఎవరైనా బాధపడితే పవన్ తట్టుకోలేడని నాగబాబు తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆర్థిక స్థితిపై నాగబాబు మాట్లాడుతూ, అయితే, డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని... ఆర్థిక సమస్యలను లెక్క చేయడని తెలిపారు. మరో నాలుగైదు సినిమాలు చేస్తే ఆర్థికంగా సెటిల్ అవుతాడని.. అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని తెలిపారు.