ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా నటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులపై చర్చించేందుకు పలమనేరులోని చిత్ర నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. చిత్రంలోని కొన్ని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని తెలిపారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఎంట్రీ నుంచి ఈ సినిమా వుంటుందని చెప్పారు. ఇందులో రాజకీయ అజెండా వుండదన్నారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని.. అందులో చాలా చాప్టర్లున్నాయని.. తాను ఒక చాప్టర్‌ను ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడం నుంచి ఆయన మరణం వరకు ఈ చిత్రం వుంటుందని వర్మ స్పష్టం చేశారు.