ఒక్క ప్రాణమున్న జంతువూ లేదు. అంతా గ్రాఫిక్సే.. బాహుబలి మహా మాయ!

గురువారం, 23 మార్చి 2017 (06:41 IST)
మనకళ్ల ముందు ఒక మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించిన బాహుబలి టీమ్ గత అయిదేళ్లుగా ఈ రెండు భాగాల చిత్రానికి నగిషీలు చెక్కుతూనే కాలం గడిపింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని అద్భుతాలను సృష్టించి సెలవు తీసుకుంది. సెలవు తీసుకున్నారనే కానీ మనముందుకు బోలెడన్ని బాహుబలి కబుర్లతో సందడి చేయడానికివస్తోంది. బాహుబలితో తన జర్నీకి సంబంధించిన  విశేషాలను తొలిసారిగా ఆ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ పంచుకుంటున్నారు. ఆయన బయట పెట్టిన ఒక విషయం బాహుబలి సినిమా అభిమానులకు షాక్ తెప్పించేలా ఉంది. 
 
బాహుబలి ది బిగినింగ్‌తో అందరి అంచనాలను పెంచేసిన సాబు శిరిల్ బాహుబలి2 సినిమాకు దేశవ్యాప్తంగా షూటింగ్ జరిపినట్లు తెలిపారు. ఈ భారీ చిత్రంకి సంబంధించిన అత్యంత కీలక ఘట్టాలను మాత్రమే రామోజీ ఫిలిం సిటీలో చిత్రించామని చెప్పారు. యుద్ధ దృశ్యాలతో సహా కీలకమైన యాక్షన్ భాగాలను ఫిలిం సిటీలోనే తీశారట. ఇంతవరకు బాగానే ఉంది. చిత్ర విశేషాలకు సంబంధించి మరో బాంబును పేల్చాడు శిరిల్.
 
అయిదేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న బాహుబలి రెండు భాగాల్లోనూ ఒక్కటంటే ఒక్క ప్రాణమున్న జంతువును కూడా షూటింగ్ కోసం వినియోగించలేదట. సినిమాలో మనం చూసిన జంతువులన్నీ కళాసృష్టిలో భాగమేనట. బాహుబలి ది బిగినింగ్ చూస్తున్నప్పుడే మనకు అలా కృత్రిమంగా తీర్చి దిద్దిన జంతువులు ఎంత సహజంగా ఉన్నాయో మనకు తెలియవచ్చింది. అలాగా రెండు భాగాల్లోనూ భారీ యుద్ధ దృశ్యాలు ఉన్నందున సినిమాలో ఉపయోగించిన అన్ని ఆయుధాలు, ఆయుధాగారాలను ఎంతో ముందస్తుగా రూపొందించినట్లు సాబు శిరిల్ చెప్పారు.
 

వెబ్దునియా పై చదవండి