బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన బూదగుంప గ్రామానికి చెందిన ద్యావన్నకు మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యను నిర్లక్ష్యం చేస్తూ, పొరుగు గ్రామం కామనూరుకు చెందిన నేత్రావతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది కిందట ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, వివాహమయ్యే సమయానికే నేత్రావతికి అదే గ్రామానికి చెందిన శ్యామన్న అనే వ్యక్తితోనూ వివాహేతర సంబంధం ఉంది. వివాహమైన అనంతరం ద్యావన్నను తనను పట్టించుకోవడం లేదని, హత్య చేస్తే శ్యామన్నతో కలిసి ఉండవచ్చని భావించింది.
బూదగుంపలో ఒక గ్యారేజ్ నుంచి తీసుకు వచ్చిన ఇనుప రాడ్‌తో ద్యావన్నపై ఇంట్లో జులై 25న దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి రాత్రికి రాత్రి కాల్చేశారు. భర్త ఫోనును ఆమె స్విచాఫ్ చేసింది. నీ భర్త ఎక్కడ అని అడిగిన వారందరికీ ధర్మస్థలకు వెళ్లాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, శ్యామన్నతో కలిసి నాగపంచమి ఆచరించుకోవడం, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా, జరిగిన ఘటనపై నోరు విప్పింది. శ్యామన్నను కూడా పోలీసులు అరెస్టు చేశారు.