సమాంతర చిత్ర ప్రపంచం కోల్పోయిన నట 'ఆక్రోశం' ఓంపురి
శనివారం, 7 జనవరి 2017 (14:20 IST)
కొన్ని ముఖాలు కథలను ప్రదర్సించడానికే రూపొందించబడి ఉంటాయి. ఓంపురి అలాంటి ముఖాల్లో ఒకటి. అత్యంత సగటు మనిషిలా కనిపిస్తూనే అసాధారణమైన హావభావాలతో 1980లు, 90లో బాలీవుడ్‌ను, భారతీయ ప్రేక్షకులను వెంటాడిన వదనం తనది. మరోమాటలో చెప్పాలంటే ఆ వదనం ఇతరుల ముఖాలను (పాత్రలను) చూపించడానికే పుట్టింది. ఆ ముఖం ప్రదర్శించే హావభావాల కోసమే బాలీవుడ్ సినిమాల్లో అనేక కథలు పుట్టాయంటే అతిశయోక్తి కాదు.
అది జానే భీ దో యారో సినిమాలో తాగుబోతు అహుజా పాత్ర కావచ్చు. టీవీ సీరీయల్‌గా సంచలనం రేకెత్తించిన తమస్‌లో అణచివేతకు గురైన నిరుపేద పాత్ర కావచ్చు. భారతీయ సమాంతర సినిమాకు కొత్త అర్థం చెప్పిన అర్థసత్య లోని ఇన్‌స్పెక్ట్రర్ అనంత్ వెలాంకర్ పాత్ర కావచ్చు. మై సన్ ది ఫానటిక్ సినిమాలో.. బ్రిటన్ లోని పాకిస్తాన్ దేశీయుల జీవితాన్ని అత్యద్భుత రీతిలో ప్రదర్శించిన పర్వేజ్ పాత్ర కావచ్చు. ఈస్ట్ ఈజ్ ఈస్ట్ ఆంగ్ల సినిమాలోని జార్జ్ ఖాన్ పాత్ర కావచ్చు. తాజాగా 2015లో విడుదలైన భజరంగి భాయిజాన్ సినిమాలో ఒక మామూలు పాత్ర అయిన మౌలానా సాహెబ్ పాత్ర కావచ్చు.. తాను నటించిన ప్రతి సినిమాను నటన పరంగా అమాంతంగా పైకెత్తిన అద్వితీయ నటుడు ఓంపురి.
1980లలో బాలివుడ్ చిత్ర ప్రపంచం సృష్టించిన నిరుపమాన నటుల్లో కొట్టొచ్చినట్లు కనిపించేవారు నసీరుద్ధీన్ షా, ఓం పురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ. ముఖ్యంగా నసీరుద్దీన్ షా, ఓంపురి ఎంత అద్భుత నటులో చెప్పడానికి ఒక మక్భూల్ సినిమా చాలు. మన కళ్ల ముందు కనిపిస్తున్నది నటనా లేక విస్తారమైన జీవిత దృశ్యమా అని మైమరిపింపజేసే నటనా వైదుష్యానికి నిజమైన ప్రతినిధులు వీరు. కాని సమాంతర సినిమాలను వాణిజ్య సినిమా మింగేసిన పాడుకాలంలో ఈ గొప్ప నటులు కూడా పొట్టకోసం పాట్లు పడే సినిమాల బారిన పడటమే సినీ ప్రపంచపు విషాదం.
నిశ్శబ్దంతో ప్రేక్షకులను ఎలా స్తంభింప చేయవచ్చో, ఉత్కంఠను ఎలా రేకెత్తించవచ్చో తెలిపే ఆణిముత్యం అక్రోశ్ అనే హిందీ చిత్రం. ఇది 1980లో వచ్చింది. దక్షిణాదిన కమల్ హసన్ అప్పటికి ఏ ప్రయోగాలు, కొత్త కొత్త పాత్రలు చేయని రోజుల్లో సినిమా మొత్తంగా మాటల్లేని పాత్ర పోషించిన చరిత్ర ఓంపురి దక్కించుకున్నాడు. సమాంతర చిత్రాలకు సంబంధించి నిరుపమాన దర్శకుడు గోవింద నిహలానీ తొలి సినిమా ఆక్రోష్. భారతీయ సమాజంలో అంతర్గతంగా సాగుతున్న వర్గ, కుల అణచివేతను ప్రామాణిక రీతిలో చాటి చెప్పిన చిత్రమిది.
ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఓంపురిది. తన భార్యను చంపిన ఆరోపణకు గురై విచారణను ఎదుర్కొంటున్న గిరిజనుడిగా ఓంపురి పాత్ర భారతీయ సినిమాల్లో శిఖరప్రాయమైన నటనకు మారుపేరుగా నిలిచిపోయింది. సినిమా మొత్తం మీద ఓంపురి మూగపోయి మౌనంగా చూస్తుంటాడు. బోనులో నిల్చున్నా మాట్లాడడు. విచారణలోనూ మాట్లాడడు. మాట్లాడకపోతే నేరం అంగీకరించినట్లే నని హెచ్చరించినా మాట్లాడడు. కానీ అతడి కళ్లు అతడి జీవిత బాధలన్నింటినీ ప్రపంచానికి ప్రదర్శిస్తుంటాయి. ఆ కళ్లే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటాయి.
సినిమా ప్రారంభ దృశ్యంలోనే డిఫెన్స్ లాయర్ పాత్రధారి నసీరుద్దీన్ షా లహానియా బైకూ అనే గిరిజనుడిని ఏం జరిగిందని ప్రశ్నిస్తుంటాడు. అప్పుడు కెమెరా ఓంపురి ముఖంపైనే నిలుస్తుంది. అతడి నిశ్శబ్దం అలాగే సాగి అతడి చెంప ఒక్కసారిగా వెనక్కు గుంజుకుంటుంది. ఆ పేలవమైన వదనంలో కనిపించే ఆ భంగిమ చూస్తున్న వారి హృదయాలను కరిగిస్తుంది.
బాధను వ్యక్తీకరించలేడు కాబట్టే ఆ గిరిజనుడు తన స్వరాన్నే కోల్పోతాడు. కానీ ఓంపురి మాట రాని ఆ గిరిజనుడి బాధను ఎంతగా నటనలో పలికించాడంటే కొన్ని తరాల గిరిజనుల బాధలను ఆ ఒక్క పాత్రలో చూపించాడు. దేశంలోని గిరిజనుల బాధల గురించి ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నంచగా అతడు మౌన మూర్తి అయిపోతాడు. మాటలేని, మాటల్ని కోల్పోయిన ఆ నటన చూస్తున్న వారిని దిగ్భ్రాంతి పరుస్తుంది. మాటలు రాకుండా చేస్తుంది. ఒక్కసారి ఆక్రోశ్ సినిమాను చూస్తే మాటల్లేని ఆ నటన మనల్ని వెంటాడుతుంది.
అణచివేత పునాదిగా కలిగిన భారతీయ సమాజంలో అన్యాయానికి బలైన, నేటికీ గురవుతున్న లక్షలాది గిరిజనుల సామూహిక ఆక్రోశం అది. అందుకే ఆ సినిమాకు మరణం లేదు. ఆ పాత్రను తన ముఖంలో చూపించిన ఓంపురికీ మరణం లేదు. ఆ ఒక్క సినిమా.. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అతడి నటనకు ఎదురు చూసేలా చేసింది.
భారతీయ సినిమా తెరను పునర్నిర్వచించిన పాత్రఅది. సినిమాలో డైలాగ్ చేసేది ఏమిటి, చేయనిది ఏమిటి అనే విషయాన్ని దిగ్భ్రాంతి గొలిపే స్థాయిలో వెల్లడించిన పాత్ర అది. గిరిజనుడైన లహన్యా బైకు పాత్రలో ఒక్కటంటే ఒక్కపదం కూడా ఉచ్చరించకుండానే వెండితెరను ఉద్దీపింపచేసిన పాత్ర అది. అలాంటి సినిమా జీవితంలో ఒక్కసారి పోషించినా నటుడనేవాడికి అదే వెయ్యిపాత్రల పాటి. కాని అదే సంవత్సరం కేతన్ మెహతా తీసిన కుల అణిచివేతకు సంబంధించిన గుజరాతీ చిత్రం భవాని భావై లోనూ నటించాడు ఓంపురి. ఆ తర్వాత కేతన్ మెహతా దర్శకత్వం వహించిన హోలీ (1985), మిర్చ్ మసాలా (1997) సినిమాల్లోనూ నటించాడు.
1983లో గోవింద్ నిహలానీ తీసిన అర్ధ్ సత్య సినిమాలో సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషించిన తర్వాత ఓంపురి భారతీయ సమాంతర సినిమాలో అంతర్భాగమయ్యాడు. సోషలిస్టు చింతనతో భారతీయ సినిమాకు వాస్తవికతను పరిచయం చేసిన క్షణాలవి. పాటలు, భావోద్వేగాలు లేకుండానే కేవల వాస్తవికత ప్రాతిపదికన సినిమాకు కొత్త రూపునిచ్చిన కాలమది. హాస్య, విషాద పాత్రలకు ఓంపురిని మారుపేరుగా నిలబెట్టిన చరిత్ర అది.
దేశవిభజన నాటి పరిణామాల నేపథ్యంలో భీష్మసహానీ 1974లో రాసిన తమస్ ఆధారంగా తీసిన దూరదర్శన్ సీరియల్ తమస్‌లో మతఘర్షణల్లో చిక్కుకున్న హిందూ నిమ్నకుల వ్యక్తి పాత్రలో ఓంపురి జీవించాడు. విభజనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న భారతీయుల భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్లిన సంచలనాత్మక చిత్రం తమస్. తొలి సినిమా ఆక్రోశ్‌లో నోటి మాటలేకుండా చూపుల్తోనే నటించిన ఓంపురి తదుపరి చిత్రాల్లో గంభీరకంఠంతో, కింగ్ ఆఫ్ ది వాయిస్ ఓవర్‌గా పేరుపొందాడు. వాణి్జ్య సినిమాల్లో సహాయక పాత్ర పోషించినా సరే ఓంపురి పాత్ర అందరినీ డామినేట్ చేసేది.
ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్మితాపాటిల్ వంటి వాస్తవికమైన నట దిగ్గజాలు ఉండేవారు కాబట్టే, గోవింద్ నిహలానీ, శ్యామ్ బెనెగల్, కేతన్ మెహతా, సయీద్ అక్తర్ మీర్జా, కుందన్ షా వంటి దర్శకులు దేశం మునుపెన్నడూ చూసి ఉండని అద్వితీయ సినిమాలను తీయగలిగారు. వీరి దార్శనికతను హావభావాలద్వారా పలికించిన గొప్ప నటులు వీరు. వీరితోనే ప్యారలల్ సినిమా అంతర్ధానమయిందా అంటే సమాధానం చెప్పలేని స్థితి.
తన కెరీర్ మొత్తంలో అటు సమాంతర సినిమాల్లో, ఇటు వాణిజ్య సినిమాల్లో ఓంపురి చూపించిన నటన. తన కళ్లు ప్రదర్శించిన భావాలను సినీ ప్రపంచం మరవలేదు. మలి జీవితంలో వృత్తి నిబద్ధత కలిగిన పోలీసు అధికారి పాత్రలను, ఇతర సహాయక పాత్రలను మాత్రమే పోషించినా, అవి మాత్రమే తనకు లభ్యమైనా, బాలీవుడ్ మాత్రమే కాదు... భారతీయ చిత్ర పరిశ్రమ ప్రసాదించిన అతి గొప్ప నటుల్లో అగ్రగణ్యుడు ఓంపురి.
1990ల మొదట్లో ఓంపురి తెలుగులో నటించిన అంకురం చిత్రం నక్సలిజం నేపథ్యంలో పౌరహక్కుల సమస్యను ప్రతిభావంతంగా చాటి చెప్పింది. తన బిడ్డతో కలిసి ప్రయాణిస్తూ మధ్యలో పోలీసులు నిర్బంధానికి గురై చిత్రహింసల పాలవుతున్న క్రమంలో, తన ఉనికిని బయటపెట్టి న్యాయస్థానం వరకు తీసుకొచ్చిన సాధారణ గృహిణి -రేవతి-ఔన్నత్యాన్ని, పేదలకు, నిస్సహాయులకు అండదండగా నిలబడాల్సిన అవసరాన్ని చాటిచెబుతూ కోర్టుబోనులోనే కన్నుమూసే పాత్రకు ఓంపురి జీవం పోశారు. తెలుగులో అత్యంత అరుదుగా రూపొందిన వాస్తవికవాద చిత్రాలలో అంకురం సినిమాకే అగ్రస్ఖానం.
ఉద్యమకారులు అంటే ఏకే 47లు చేతబట్టి గావుకేకలు, పెడబొబ్బలు పెడుతూ ఎగిరేవారు అని ముద్రపడిపోయిన తెలుగు సినీ చరిత్రలో..ఇది నటనేనా అనిపించడం కాదు... ఇదే నటన అనిపింపజేసిన మరొక సైలెంట్ పాత్రను ఓంపురి అద్వితీయంగా అంకురంలో పోషించాడు. చివరలో కోర్టులో చెప్పిన చిన్న డైలాగు తప్పితే ఓంపురికి తెలుగు సినిమాలోనూ పూర్తగా మౌన పాత్రే లభించడం కాకతాళీయం. కళ్లలో, చెంపల్లో బాధను ప్రదర్శించడం ఓంపురికే సాధ్యం అని నిరూపించిన మరొక చిత్రంగా అంకురం నిలిచిపోయింది.
భారతీయ సగటు మనిషిని, పీడితులను ముఖంలో పలికించడం ద్వారా ఓంపురి దేశాన్ని ఎంత దిగ్భ్రాంతి పరిచాడో తన ఆకస్మిక మరణంతోనూ అంతే దిగ్భ్రాంతిని కలిగించాడు. చిత్రసీమలోనే కాదు.. దాంపత్య జీవితంలోని వ్యక్తిగత అహంభావాలతోనూ నిత్యం ఘర్షిస్తూనే, అనివార్యంగా అలవాటైన అతి మద్యపానంతో ఒళ్లు హూనం చేసుకుంటూనే ఓంపురి వెళ్లిపోయాడు. భారతీయ గిరిజనుల, పీడితుల దుర్భర స్థితి పట్ల ఓంపురి ప్రదర్శించిన నటనానురూప ఆక్రోశం ఎన్నడూ మరిచిపోలేం. కానీ మరణానికి ఇంకా సిద్ధపడని, ఊహించని వ్యక్తి ఉన్నట్లుండి మరణించడమే ఈ ప్రపంచంలో ఏకైక వాస్తవం. విషాదం కూడా.