వివాదాలు, గొడవలు, నిరసనలు, ఆందోళనలు, దాడులు, అరాచకాల మధ్య బాలీవుడ్ చిత్రం "పద్మావత్" గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో అయితే మూవీ విడుదలను అడ్డుకుంటూ రాజ్‌పుత్ కర్ణిసేనలు కదం తొక్కారు. థియేటర్లపై దాడులు చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. స్కూల్ బస్సులపై దాడులు చేశారు. షాపులు పగలగొట్టారు. రైళ్లను అడ్డుకున్నారు. మొత్తంగా జనజీవనాన్ని స్తంభింపజేశారు. ఇన్ని నిరసలన మధ్యే ఈ చిత్రం విడుదలైంది.
అయితే, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లోని థియేటర్లు పద్మావత్ సినిమా ప్రదర్శించలేదు. షో వేయటానికి థియేటర్ యజమానులు వెనకాడారు. దాడులు జరుగుతుండటంతో.. సినిమాను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. విధ్వంసాలను అడ్డుకోలేక పోతున్న పోలీసులు.. థియేటర్లకు కూడా రక్షణ ఇవ్వలేకపోతున్నారు. పోలీసులు రక్షణ కల్పించినా చిత్రాన్ని ప్రదర్శించలేమని వేయలేం అని తేల్చిచెప్పారు.
ముఖ్యంగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క షో కూడా వేయలేదు. రాజస్థాన్‌లో ఆందోళనలు మరీ ఎక్కువగా ఉన్నాయి. రాజ్‌పుత్‌లు ఎక్కువగా ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో చిత్రం విడుదల కాలేదు. ఈ చిత్రం ప్రివ్యూలు చూసిన వారంతా రాజ్‌పుత్‌లు ఊహించినంత ఏమీ లేదని.. అసలు సినిమాలో అంత సీన్ లేదని నెత్తీనోరు బాదుకుని మరీ చెప్పారు. అయినా రాజ్‌పుత్‌లు ఆందోళనలు ఆపలేదు.
ఇదిలావుండగా, పద్మావత్' సినిమాను అడ్డుకోరాదని... సినిమా ప్రదర్శనకు అడ్డంకులు కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులను ఆ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. అంటే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం ద్వారా, కోర్టు ధిక్కరణకు ఈ నాలుగు రాష్ట్రాలు పాల్పడ్డాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాల మేరకు భద్రతా చర్యలను చేపట్టడంలో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు, రాజ్‌పుత్ కర్ణిసేనకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులపై కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.