అది పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం : పరుచూరి గోపాలకృష్ణ

వరుణ్

గురువారం, 6 జూన్ 2024 (21:05 IST)
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సాధించిన అఖండ విజయంపై తెలుగు చిత్రపరిశ్రమ పులికించిపోతుంది. చిత్రపరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా చేరిపోయారు. ఆయన పవన్, చంద్రబాబులతో తనకున్న అనుబంధాన్ని ఓ సారి గుర్తు చేసుకున్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన చేశారు. 
 
"నేను పవన్‌ కల్యాణ్‌ సినిమాకు పని చేయలేదు. మేమిద్దరం ఒక్కసారే కలిశాం. పవన్‌కు బిడియం ఎక్కువ. కానీ, ఈ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పని చేశాడు. ఏ క్షణం ఆయన కళ్లలోకి చూసినా 'నేను సాధిస్తున్నా' అనే ఆత్మ విశ్వాసం కనిపించింది. ఆయన అభిమానులు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో నాకు తెలుసు. పవన్‌ కల్యాణ్‌ను చూసినప్పుడు వాళ్ల అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతం. వాళ్లందరినీ ఒప్పించి టీడీపీ, బీజేపీలతో కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలను మెప్పించి విజయం సాధించారు. ఒకవేళ ఆయన కూటమిలో భాగం కాకపోతే ఏమయ్యేదో చెప్పలేకపోయేవాళ్లం. ఆ పరిస్థితి రానివ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారు. గెలిచాక కూడా పవన్‌ ఎంతో వినయంతో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నేరవేర్చాలనే ఆలోచనతోనే మాట్లాడారు. ఎవరినీ నిందించలేదు. అలా మాట్లాడడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం'' అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించారు.
 
ఇకపోతే, ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. ప్రజలు కోరుకున్నవిధంగా రాజకీయ నాయకులు ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారు. నాకు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. ఆయన గవర్నమెంట్‌లో గతంలో నేను పని చేశాను. పోరాటశక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఆయన అరెస్టు చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డాను. ప్రజలను మెప్పించారు. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు అంటూ తెదేపా అధినేత చంద్రబాబును పరుచూరి గోపాలకృష్ణ అభినందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు