'అన్నయ్య' టైటిల్‌ను వాడుకోనున్న 'తమ్ముడు'

మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:42 IST)
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాట రానాలు కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. 
 
అయితే, మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్‌లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును రెండు రోజుల క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించే అవకాశం వుంది. 
 
ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే.. 'బిల్లా రంగా' అనే పేరు బాగా వినిపిస్తోంది. చిత్రకథకు ఇది సరైన టైటిల్ అవుతుందని భావిస్తున్నారట. పవన్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో దాదాపు దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం.
 
కాగా, గత 1982లో 'బిల్లా రంగా' పేరుతో తెలుగులో ఓ చిత్రం వచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా అప్పట్లో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 
 
ఇపుడు ఈ తాజా చిత్రానికి కూడా ఈ టైటిల్ అయితే సరిగ్గా సూటవుతుందని భావించిన చిత్ర యూనిట్ ఆ టైటిల్ వైపు మొగ్గు చూపగా, హీరోలు కూడా సమ్మతించినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు