సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నటన, సైగలకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ ప్రశంసలపై ప్రియా వారియర్ స్పందించింది. మలయాళ సినీ పరిశ్రమలో చాలా పాప్యులారిటీ ఉన్న స్టైలిష్ స్టార్ చేసిన ట్వీట్‌పై ప్రియా ప్రకాశ్ హర్షం వ్యక్తం చేసింది.
ఓ కార్యక్రమంలో ప్రియా వారియర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది. కాగా ప్రియా వారియర్ త్వరలో అల్లు అర్జున్ సరసన నటించబోతోందని.. ఇందుకు సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలతో పాటు కేరళ సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.