ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

ఠాగూర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:20 IST)
తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులను ఉద్దేశించి తాజాగా ఆయన పోస్ట్‌ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు చెప్పారు. 
 
'నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. తాను త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
 
కాగా, రజనీకాంత్ సెప్టెంబరు నెల 30వ తేదీన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు