రాజకీయాల్లోకి వస్తే.. ఆ పని చేయను.. నా పేరును అలా వాడుకున్నారు: రజనీ కాంత్

సోమవారం, 15 మే 2017 (12:04 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ  సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పకపోయినప్పటికీ.. రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలైంది. ఇక ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా మొదలవుతుందని చెప్పుకొచ్చారు.  తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బుపై ఆశ గలవారిని దగ్గరకు చేర్చుకునే సమస్యే లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.
 
తాను ఎవరికీ భయపడేది లేదని అన్నారు. భయం అనేది తన అభిమానుల్లో ఏమాత్రం కనిపించదని.. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతానని, తనతో ఫోటో వారికి ఎంత ఆనందాన్ని అందిస్తుందో, తనకు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని, రేపు దేవుడు తనకు ఏం పని అప్పగిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా రాజకీయాలపై రజనీ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంతవరకు తమిళనాడు రాజకీయాల్లో తానెప్పుడూ పాలుపంచుకోలేదని.. ఎన్నడూ ఏ పార్టీకి మద్దతివ్వలేదని రజనీకాంత్ చెప్పారు. అన్నీ రాజకీయ పార్టీలు సమయానుసారం తన పేరును వాడుకున్నాయని ఆరోపించారు. ఇకపై అలా జరగనిచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. కొన్ని పార్టీలు తన పేరును వాడుకుంటుంటే అభిమానుల్లో సైతం పలుమార్లు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో సందిగ్ధత ఏర్పడిందని తెలిపారు. 
 
అభిమానులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రజనీ సూచించారు. ఎలాంటి సమస్య ప్రజలకు ఎదురైనా, దాన్ని తీర్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు డబ్బు అక్కర్లేదని, మీలో ఉన్న నిబద్ధత, అంకితభావమే చాలని రజనీ చెప్పినప్పుడు అభిమానుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

వెబ్దునియా పై చదవండి