చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద యుద్ధ సినిమా తీయాలనుకున్నాం. దటీజ్ బాహుబలి అంటున్న రానా

శనివారం, 6 మే 2017 (07:28 IST)
ఒకవైపు బాక్సాఫీస్ గణాంకాలు, సంఖ్యలు క్రక్కదిలిపోతున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ భారతీయ చిత్ర పరిశ్రమలోని పాత రికార్డులన్నింటికీ పాతరేసింది. బాహుబలి 2 ప్రభంజనం చూస్తూ మురిసిపోతున్న భళ్లాల దేవ పాత్రధారి దగ్గుబాటి రానా భారతీయ చలనచిత్ర చరిత్రలో అతి పెద్ద యుద్ధ సినిమా తీయాలనుకున్నాం. తీసి చూపించాం అదే బాహుబలి అంటున్నాడు. నంబర్లను గురించి ఆలోచిస్తూ సినిమాలు తీసే తరహా వ్యక్తులం కాదు కాబట్టే మా అందరి కృషి ఈ రోజు చరిత్ర సృష్టిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు.
 
అది 2012వ సంవత్సరం. భారతదేశంలో అతి పెద్ద యుద్ధ కావ్యాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మేం బయలుదేరాం. అది కృతనిశ్చయం, నిబద్ధతలతో సాగిన ప్రయాణం. మెట్టుమెట్టుగా దాన్ని చేపట్టాం, చివరికి గమ్యం చేరుకున్నాం అంటూ బాహుబలి చిత్ర ప్రారంభం నుంచి నేటివరకు ఒక జట్టుగా చిత్ర యూనిట్ చేసిన  ప్రయాణం గురించి చెప్పాడు.
 
బాహుబలి ఒక మార్మికమైన కాల్పనిక డ్రామా. అమరచిత్ర కథ, ఇతర పురాణ గాథల ప్రేరణ నుంచి పుట్టిన కథ అది. కొన్ని ప్రేరణలు మన అంచశ్చేతనలోనే పని చేస్తుంటాయి అంటూ నరసింహాతారం, హిరణ్య కశిపుడి స్థాయిలో బాహుబలితో తాను చేసిన యుద్ధం అలాంటి ప్రేరణతోనే సాధ్యమైందని రానా చెప్పాడు. ఇద్దరు బాహుబలులతో తలపడాల్సి వచ్చినప్పుడు తాను తన శరీరాకృతిని ఎంతగా మార్చుకోవాలో అంతస్థాయిలో కష్టపడినట్లు తెలిపాడు. 
 
ఒక నటుడిగా తాను రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌‌ల దార్శనికతకు పూర్తిగా లోబడిపోయానని, ప్రతి విషయాన్ని సర్వసమగ్రంగా పరిశీలించడంలో వారు గ్రేట్ అని రానా ప్రశంసించాడు. రాజమౌళి ఏ వ్యక్తినైనా నిశితంగా పరిశీలిస్తారు, మీలో ఏదైనా నచ్చిన అంశం తనకు కనబడిందంటే, ఇక మీ వెన్నంటి పడి మరింత మెరుగ్గా పనిచేసేలా మిమ్మల్ని నడిపిస్తారు అని రానా చెప్పాడు.
 
బాహుబలి ది బిగినింగ్‌లో కేవలం మా పాత్రలు మాత్రమే పరిచయమయ్యాయని, కానీ ప్రేక్షకులు మా వెనుకటి గాథలను, వాటి నాటకీయతను చూడలేదని అందుకే అది పూర్తిగా రెండో భాగంలో ప్రదర్శితమయిందని రానా వివరించాడు. తొలిభాగం బ్లాక్ బస్టర్ అయింతర్వాతే టీమ్ మొత్తం బలం పుంజుకొంది. మరింత పెద్ద కలను కనేలా మా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఇది ఒక ప్రాంతానికి చెందిన కథ కాదని భారతదేశం మొత్తానికి చెందిన కథ కాబట్టి, అంత బలమైన కథ తయారైంది కాబట్టే ఈరోజు ఊహించని విజయాన్ని తమ కళ్లముందే చూస్తున్నామని రానా ఉద్వేగంతో చెప్పాడు. 
 
రెండో భాగం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేసింది. కొన్నింటిని  వదిలిపెట్టింది. వాటిలో భల్లాల దేవ భార్య ఎవరనేది ఒకటి. కానీ ఈ కథకు బల్లాలుడి భార్య అవసరం లేదు కాబట్టే ఆ పాత్రను కల్పించలేదని రానా నవ్వుతూ చెప్పాడు. ఘాజీ వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని మధ్యలో తాను తీయడానికి కూడా బాహుబలే ప్రేరణ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు రానా.
 

వెబ్దునియా పై చదవండి